Anji Reddy Chinnamile: ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ నియోజక వర్గాల ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ ఉండటంతో.. ఇప్పటికే అన్ని నియోజక వర్గాల్లోని పట్టభద్రులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. మండలిలో ప్రజా గొంతుకగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో గళమెత్తుతానని చెప్పారు. అలాగే, విద్యార్థుల కోసం మండల స్థాయిలో మోడల్ స్కూల్స్, స్కాలర్ షిప్స్, యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణతో పాటు ఉచిత కోచింగ్, పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిస్తానని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: MLC Elections 2025: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
ఇక, భారతీయ జనతా పార్టీ వైపే మేధావులు, యువత ఉన్నారు.. ఎమ్మెల్సీగా 100 శాతం విజయం సాధిస్తానని చిన్నమైల్ అంజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక, విద్యా సంస్థల్లో ఉన్న స్టూడెంట్స్ బాధలు ఇతర పార్టీల అభ్యర్థులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తానన్నారు. అలాగే, తనపై ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారు.. నా మీద బురద చల్లిన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. బీజేపీని గెలిపించాలని మేధావులు, యువత ఆలోచిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా.. నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కోరారు.