ఈరోజు తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలిమెట్టు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకే మూడు లక్షల వరకు రుణాలు, సబ్సిడీకి ట్రాక్టర్లు & వ్యవసాయ పనిమూట్లు, మద్దతు ధరతో ధాన్యం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ, టీఆర్ఎస్ రైతు బంధు పథకం తీసుకొచ్చి, ఆ స్కీమ్స్‌ని బంద్ చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి, బలహీన వర్గాల్ని, పాడుభూమి వ్యవసాయం చేసుకునే గిరిజనుల్ని రక్షించడానికి.. రాహుల్ గాంధీ వ్యవసాయ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని.. ఇందుకు తాము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, పెండింగ్‌లో ఉన్న లక్ష్యాలన్నీ తప్పకుండా నెరవేరుతాయని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ముందు ఎన్నో లక్ష్యాలు ఉండేవని, నదుల నీళ్ళు పంట పొలాలకు పారుతాయని, రైతాంగ సోదరులు ఆత్మగౌరవంతో బతుకుతారని, సంపదంతా ప్రజలకు దక్కుతుందని సోనియా గాంధీ ఆశించారన్నారు. కానీ, ఎనిమిదేళ్ళయినా కృష్ణా నదిపై గానీ, గోదావరి నదిపై గానీ టీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పది లక్షల కోట్లు ఖర్చయ్యింది కానీ, ఒక్క ఎకరానికి నీళ్ళు అందలేదన్నారు. ఆ లక్ష్యాల్ని నెరవేర్చడానికే రాహుల్ గాంధీ నేనున్నానంటూ వచ్చారన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కదం తొక్కుతూ వచ్చిన రైతాంగ సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తన ప్రసంగాన్ని భట్టి విక్రమార్క ముగించారు.