ఏఐసీసీ ఆదేశాల మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మార్చి 16 నుంచి జూన్ 15 వరకు సుమారు 91 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయడానికి గాంధీ భవన్ లో నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు మూడు నెలలపాటు చేసే పాదయాత్రను విజయవంతం చేయడానికి నియోజకవర్గ కోఆర్డినేటర్లు సంపూర్ణంగా పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలన్నారు. జిల్లా, మండల, బ్లాక్, బూత్ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచి పెద్ద ఎత్తున ప్రజలను పాదయాత్రలో భాగస్వామ్యం చేయాలని, లక్షల మందిని పాదయాత్రలో భాగస్వామ్యం చేసే విధంగా కోఆర్డినేటర్లు పక్కగా ప్లాన్ చేసుకోవాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోనే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరడానికి సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రజల లక్ష్యాలు నెరవేరడానికే మండు టెండను సైతం లెక్కచేయకుండా చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయండన్నారు.
Also Read : Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఈ యాత్ర తోడ్పడాలని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం.. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్ మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్ర వ్యక్తిగతం కాదు.. ఇది కాంగ్రెస్ యాత్ర అని ఆయన అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈనెల 16 నుంచి ప్రారంభించే పాదయాత్ర సాధారణమైనది కాదు చాలా సాహసోపేతమైన యాత్ర అని ఆయన అన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మూడు నెలలపాటు 1365 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర కు కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగమే భట్టి పాదయాత్ర అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భట్టి విక్రమార్క చేపట్టబోయే పాదయాత్రను నియోజకవర్గ కోఆర్డినేటర్లు సీరియస్ గా తీసుకొని విజయవంతం చేయాలి.
Also Read : Same Gender Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదు.. తేల్చిచెప్పిన కేంద్రం
పాదయాత్ర విజయవంతం కోసం పార్టీ నాయకులను శ్రేణులను సమన్వయం చేయడంతో పాటు పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయడం, విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. ఇప్పటికే రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి యాత్ర విజయవంతంగా నడుస్తున్నది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతం కావడానికి కోఆర్డినేటర్లు కృషి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి కాంగ్రెస్ భావజాలం, రాహుల్ సందేశాలను పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ల పైనే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ యాత్రలు తోడ్పడతాయి.’ అని ఆయన అన్నారు.