Same Gender Marriage: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. భారతీయ వివాహ వ్యవస్థలో స్వలింగ వ్యక్తులతో కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండడం భారతీయ కుటుంబ యూనిట్ భావనతో పోల్చదగినది కాదని వెల్లడించింది. సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన కేసులో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భారతదేశ సంస్కృతికి, జీవన విధానానికి స్వలింగ వివాహాలు విరుద్ధమని కేంద్రం కోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించి చట్టాలు చేయడానికి సిద్ధంగా లేమని కేంద్రం కోర్టులో తన వైఖరిని తెలిపింది.1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వివాహ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన భద్రత ఏదీ ఈ స్వలింగ వివాహాలకు వర్తించవని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనే హక్కు ఉన్నప్పటికీ.. అది స్వలింగ వివాహాలకు వర్తించదు. ఈ స్వలింగ వివాహాలు ప్రాథమిక హక్కుల్లోనూ లేవు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.
Read Also: Naked On Street: వీధిలో నగ్నంగా నడిచాడు.. తన బట్టలు ఎక్కడో వదిలేశాడో కూడా తెలీదంట!
ఇటీవల లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా సమాజం కూడా వాటిని అంగీకరిస్తోంది.ఇందుకు తగ్గట్లుగా ఎన్నో దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. కేంద్రం స్వలింగ వివాహాలను వ్యతిరేకించడానికి సామాజిక సంస్థలను ఉదహరించింది. ఒక నియమావళి స్థాయిలో, సమాజం కుటుంబంలోని చిన్న యూనిట్లను కలిగి ఉంటుంది. ఇవి ప్రధానంగా భిన్నమైన పద్ధతిలో నిర్వహించబడతాయి. స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించకపోవడం వల్ల ఎలాంటి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లదని కేంద్రం స్పష్టం చేసింది.స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్‌లను మార్చి 13న సుప్రీం కోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.