తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రతిపక్షం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్టు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్లో ఊపుతెచ్చేందుకు.. కొత్తవారిని ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ప్రజలతో మమేకం అవుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.. పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అయితే, ప్రస్తుతానికి ఆయన పాదయాత్ర వాయిదా పడింది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు బీజేపీ నేతలు.. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేయడం.. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. అయితే, ఈ నెలలోనే బండి పాదయాత్ర ప్రారంభం కానుంది.. ఈ నెల 24వ తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.