Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషం, చీము నెత్తురు చచ్చిపోయినట్లుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు విచ్చేసిన బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…. మీలో పౌరుషం చచ్చిపోయిందా? చీము నెత్తురు లేదా? ఆనాడు మీ బిడ్డ పెళ్లినాడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా మిమ్ముల్ని అరెస్ట్ చేయించి జైల్లో వేయించిందన్నవ్ కదా? మిత్తీతో సహా చెల్లిస్తానని చెప్పినవ్ కదా? మరి ఈనాడు మీరే సీఎంగా ఉన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసు స్కాముల్లో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని, ఆధారాలున్నాయని మీరే స్వయంగా చెప్పారు కదా? 14 నెలలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీలో నిజంగా పౌరుషం చచ్చిపోయిందా? లేక ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ పెద్దలతో డీల్ కుదుర్చుకున్నందున తెలంగాణలో బలపడుతున్న బీజేపీని అణిచివేయడానికి బీఆర్ఎస్ తో కలిసి లోపాయికారీ ఒప్పందం చేసుకుని కేసులు నీరుగారుస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
చెన్నూరులోని కేతన్ పల్లి ఎమ్మెన్నార్ గార్డెన్ లో మంచిర్యాల జిల్లా బీజేపీ ప్రభారీలతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ బలపర్చిన గ్రాడ్యుయేట్ అభ్యర్ధి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డితోపాటు స్థానిక నేతలతో కలిసి బండి సంజయ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
కాంగ్రెస్ పాలనలో రైతులు, ఉద్యోగులు, పట్టభద్రులు, టీచర్ల పరిస్థితి. 6 గ్యారంటీలు అమలు చేయలేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదు. కాలేజీ యాజమాన్యాలు తమ కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లాకు వస్తున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నా… అట్లా చేయకుండా సీఎం సభకు హాజరు కాకపోతే మీ అంతు చూస్తామని ఇక్కడి ఎమ్మెల్యేలు బెదిరిస్తుండటం సిగ్గు చేటు.
దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి కాంగ్రెస్ కే దక్కింది. పోటీ చేసే వాళ్లు లేకపోవడంతో బయట నుండి తెచ్చిన వ్యక్తిని గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా నిలబెట్టారు. మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులే దొరకలేదు. బీఆర్ఎస్ ఏకంగా పోటీ నుండి తప్పుకునే కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ స్కాంల్లో అరెస్ట్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా కాళేశ్వరం, ఫాంహౌజ్ డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేసుల్లో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లను అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారు. కేసీఆర్ సైతం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో డీల్ మాట్లాడుకుని రావడంతోనే ఆ కేసులన్నీ నీరుగారిపోతున్నాయి.
రేవంత్ రెడ్డిని ఆనాడు కేసీఆర్ జైలుకు పంపారు. బిడ్డ పెండ్లిరోజు అరెస్ట్ చేసి లోపలేశారు. మరి కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున స్కాములు చేసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. రేవంత్ రెడ్డికి చీము, నెత్తురు, పౌరుషం చచ్చిపోయిందా? తెలంగాణలో బలపడుతున్న బీజేపీని అణిచివేయడానికి బీఆర్ఎస్ తో చేతులు కలపడం సిగ్గు చేటు.
14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలను నట్టేట ముంచారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నరు. నెలానెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్నరు. 14 నెలలుగా రూ.56 వేల బాకీ పడ్డారు. రుణమాఫీ సగం మందికి ఇవ్వనేలేదు. రైతు భరోసా అతీగతీ లేదు.
ప్రజల కోసం కొట్లాడింది బీజేపీ. టీచర్ల కోసం లాఠీదెబ్బలు తిన్నది బీజేపీ. నిరుద్యోగుల కోసం రక్తం చిందించి కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంది బీజేపీ. నేను ప్రజల పక్షాన కొట్లాడుతుంటే నాపై హిందీ పేపర్ లీకేజీ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వడ్ల కొనుగోలు విషయంలో రైతుల బాధలను తెలుసుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వెళితే… బీఆర్ఎస్ లుచ్చా నా కొడుకులు రాళ్ల దాడి చేసి భయపెట్టాలని చూశారు. తుంగతుర్తి సమీపంలో మేం ఉన్న ఫంక్షన్ హాలు వద్ద పెట్రోలు, కిరోసిన్ పోసి సజీవ దహనం చేయాలని చూశారు. అయినా భయపడకుండా తెగించి కొట్లాడినం…
ప్రజల కోసం పోరాడిన బీజేపీని కాదని, ఏనాడూ ఒక్క ఉద్యమం కూడా చేయని కాంగ్రెస్ కు ఓటేయడం వల్ల ఏం ఒరిగిందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ మోసాలతో అల్లాడుతున్న ప్రజల బాధలను, బీజేపీ కార్యకర్తల పోరాటాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆసరా పెన్షన్ల పెంపు లేదు. రైతు భరోసా లేదు. రుణమాఫీ అరకొరే చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ లేదు. టీచర్ల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నయ్. వివ్యవస్థ అస్తవ్యస్తమైంది. చాక్ పీసులు కొనడానికి కూడా డబ్బుల్లేవ్. ఆఖరిరి ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తోంది. గతేడాది 8 వేల మంది రిటైర్డ్ అయ్యారు. ఈ ఏడాది మరో 10 వేల మంది రిటైర్డ్ కాబోతున్నరు. బెన్ ఫిట్స్ చెల్లించాలంటే 11 వేల కోట్ల రూపాయలు కావాలి. పైసల్లేవంటున్నరు. డబ్బులిచ్చే పరిస్థితి లేక ఉద్యోగుల వయోపరిమితిని 65 ఏళ్లు చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే… ఆయా సమస్యలపై ముందుండి పోరాడే బాధ్యత మేం తీసుకుంటాం…
నేను సూటిగా అడుగుతున్నా. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే 14 నెలల పాలనలో మీకు ఏమిచ్చింది? 6 గ్యారంటీలను అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డు లేదు. ఒక్క ఇల్లు ఇయ్యలే. ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలే. ఒక్క సమస్యను పరిష్కరించలేదు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవాలని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్లను వేడుకుంటున్నా. కాంగ్రెస్ మోసాలకు బుద్ది చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని కోరుతున్నా.’ అని బండి సంజయ్ అన్నారు.
US deports Indians: అక్రమ వలసదారుల బహిష్కరణ.. ఇండియా చేరిన 4వ బ్యాచ్..