Bandi Sanjay On PM Modi Telangana Tour: ప్రధాని మోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడం.. ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నెల 12న ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌ను మోడీ ప్రారంభించి, జాతికి అంకితం చేస్తామన్నారు. ప్రధాని అయిన తర్వాత మోడీ వ్యవసాయ రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారని, ఫలితంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ఒక యూరియా బస్తాకు కేంద్రం రూ.3,500 సబ్సిడీ ఇచ్చి.. రూ. 200లకే రైతులకు అందిస్తోందన్నారు. కేవలం రామగుండం ఎరువుల కర్మాగారమే కాకుండా.. మూడు జాతీయ రహదారులను కూడా మోడీ ప్రారంభించనున్నారని తెలిపారు. రైతులందరూ మోడీ పర్యటనను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. 75 అసెంబ్లీ నియోజకవర్గల్లో ఎల్‌సీడీ (LCD) స్క్రీన్స్ పెట్టనున్నామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కేంద్ర ఎరువులు, రసాయనిక శాఖ సహాయమంత్రి భగవంత్ ఖూభా మాట్లాడుతూ.. దేశంలో మూతపడిన ఐదు యూరియా యూనిట్లను తెరిపించిన ఘనత ప్రధాని మోడీదేనని పేర్కొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఏడాదికి 12.8 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోందని అన్నారు. రైతులకు యూరియా అందించడమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. 12న రామగుండంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు.. 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులతో ‘రైతే రాజు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. రైతులతో కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించి.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ఎరువుల కర్మాగారం నిర్మించిందని, దాన్ని జాతికి అంకితం చేసేందుకు మోడీ రాష్ట్రానికి వస్తున్నారని రైతులకు తెలియజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులపై ప్రజలకు తెలియజేసేలా 11న తేదీన విలేకరుల సమావేశాన్ని కూడా బీజేపీ నేతలు నిర్వహించనున్నట్టు తెలిసింది.