టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మారింది, ఇక, రెండో విడత పాదయాత్ర 5 జిల్లాల మీదుగా 348 కిలోమీటర్లు సాగుతోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి నేతలు పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు.
Read Also: Paddy Procurement: ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు.. సీఎస్ సమీక్ష..
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కసిగా ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి పాదయాత్రకు జనాలను రప్పించలేదన్న ఆయన.. ఎక్కడి వారు అక్కడే పాదయాత్రలో పాల్గొనే ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఆర్‌డీఎస్ సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పాటిల్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇక, తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చి ఏం సాధిస్తారు? అని ప్రశ్నించారు బండి సంజయ్.. టీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్నారు.. దానికి హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.