మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని, అమరవీరుల స్మృతి వనం నిర్మాణం దగ్గరకు వెళ్లి ఆవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. అమరవీరుల స్థూపం మొత్తం ఖర్చు 177 కోట్లు అని, ఇప్పటికి 100కోట్ల పనీ అయిందని, యాదాద్రి మొత్తం ఖర్చు 1200 కోట్ల అని, వర్షాలు వస్తే తిరుమలలో ఎన్ని సార్లు రోడ్లు కొట్టుకపోలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. అకాల వర్షాల వల్ల యాదాద్రిలో పనుల్లో ఇబ్బందులు వస్తే అవినీతి అంటారా అని ఆయన మండిపడ్డారు.
అమరవీరులు, దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నారూ అంటూ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. 2004లో తెలంగాణ ఇస్తాం అని చెప్పి మాతో పొత్తు పెట్టికొని మీరు మోసం చేస్తే మేము రాజీనామా చేసి బయటకు వచ్చింది వాస్తవం కదా అని ఆయన ప్రశ్నించారు. మీ చిల్లర రాజకీయల కోసం మీరు చేసే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, మీ దగ్గర అవినీతి ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు పోవడం లేదని ఆయన అన్నారు. రైతుల పట్ల మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, ఛత్తీస్ ఘడ్ లో రైతులకు రెండు గంటల కరెంటు రావడం లేదని, ఛత్తీస్ ఘడ్ లో రుణమాఫీ లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.