బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చేసి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రారని..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తరుణ్ చుగ్ కామెంట్లు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది టీఆర్ఎస్ కు కాదని.. బీజేపీకి అని విమర్శించారు. బైబై మోదీ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుందని.. మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ఆగ్రహం వ్యక్తం చేవారు. మీరు అధికారం నుంచి దిగిపోవడం ఖాయమైందని అన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చే పనిలో బీజేపీ పడిందని ఆరోపించారు.
ఈడీని ఉసిగొల్పడం మీద బీజేపీ దృష్టిపెట్టిందని.. మోదీకి రైతుల ఉసురు తగులుతుందని బాల్క సుమన్ అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని అన్నారు. దేశ యువత మోదీ హటావో భారత్ బచావో నినాదం అందుకుందని అన్నారు. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తారా..? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా.. లేదా అని ప్రశ్నించారు. మీ కార్యవర్గం సమావేశాల్లో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ హుందాగా మాట్లాడాలని.. బీజేపీ ఆఫీస్ దగ్గర పెట్టిన బోర్డును వెంటనే తీసేయాలని.. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మోదీ బొమ్మలు పెట్టి చెప్పుల దండలు వేస్తామని హెచ్చరించారు.