తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది.. యూబీఐలో తెలుగు అకాడమీ డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు హాంఫట్ అయినట్టు ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్‌మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.. దీంతో.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీలో గోల్‌మాల్ అయిన నిధులు రూ.51 కోట్లకు చేరుకున్నాయి.. కార్వాన్, సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి ఈ నిధులు మాయం అయినట్టు అధికారులు చెబుతున్నారు.. బ్యాంక్ మేనేజర్‌తోపాటు అకాడమీ అధికారుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్‌పై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకోగా.. మరోవైపు.. ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపిన తెలుగు అకాడమీ డైరెక్టర్.. ఇప్పటికే తెలుగు అకాడమీ తరఫున సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. విచారణ కూడా ప్రారంభం అయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.