తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ… బండి సంజయ్ ప్రారంభించిన ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికో, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికో కాదు.. తెలంగాణలో ఉన్న.. దళితులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, యువత అభ్యున్నతి కోసం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యాత్ర హైదరాబాద్ నిజాంను దింపే యాత్ర. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ యాత్ర అని ఆయన తెలిపారు. నా రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ సర్కార్ అంతా అసమర్థ, అవినీతి ప్రభుత్వంను నేను చూడలేదు. తెలంగాణ కోసం మోడీ సర్కార్ ఏంతో చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిధులకు పేర్లు మార్చి తెలంగాణ సర్కార్ పథకాలు తీసుకు వస్తోందని ఆయన ఆరోపించారు. మన ఊరు…మన బడి నిధులు కేంద్ర ప్రభుత్వంవి అని, కేసీఆర్ రేపు ఎన్నికలు పెట్టండి… బీజేపీ సిద్ధంగా ఉంది.. మేము మజ్లిస్‌క, టీఆర్ఎస్ కు భయపడమని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. మోడీ సర్కార్ తీసుకువచ్చిన స్కీమ్ లను కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీకి అవకాశం ఇస్తే.. నీళ్లు, నిధులు, నియమకాలతో.. తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.