మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) భారీ బహిరంగ సభకు ముందు నాందేడ్ పట్టణంలోని రోడ్లన్నీ బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, కేసీఆర్ హోర్డింగ్‌లు, బ్యానర్‌లతో గులాబీమయంగా మారాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రధాన రాజకీయ పార్టీల జాతీయ నేతల సమక్షంలో జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, రెవెన్యూ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఉండి రవీందర్ సింగ్ గత కొద్ది రోజులుగా నాందేడ్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Dipa Karmakar: అవన్నీ తప్పుడు వార్తలు..నిషేధంపై దీపా కర్మాకర్ స్పందన
ఏర్పాట్లను చూస్తూనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి… విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరఠా వీధుల్లో కలియ తిరుగుతూ వృద్దులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ… తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మరోవైపు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో మన రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు స్వచ్చంద తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : Butta Bomma: ఒక తండ్రి తన కూతురితో చూడాల్సిన సినిమా: శౌరి చంద్రశేఖర్ రమేష్