తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక, సీఎం పర్యటనను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిన్ననే పర్యటించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించారు. పలు సూచనలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరనున్నా సీఎం కేసీఆర్.. 10.30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామానికి చేరుకుంటారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.