తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ కు గజ్వేల్ సిద్దమైంది. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిర్యాలలో దళితుల సమస్యలపై సభలు నిర్వహించిన కాంగ్రెస్.. సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని… గజ్వేల్ లో సభ ఏర్పాటు చేస్తోంది. లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. పిసిసి లో కొంత మంది నాయకులు .. గజ్వేల్ లో సభ ఎందుకు… హుజురాబాద్ లో పెడితే ఎన్నికలకు అక్కరకు వస్తుందని పార్టీ నేతలు సూచించారు. అయితే… గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న పీసీసీ చీఫ్.. హైకమాండ్‌ను ఒప్పించి సభ ఏర్పాటు చేశారు.
గజ్వేల్ సభ కు రాజ్యసభ లో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. పార్టీ ఇంఛార్జి ఠాగూర్.. ఈసభకు హాజరు కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మల్లిఖార్జున ఖర్గే, ఠాగూర్ లు హైదరాబాద్ చేరుకుంటారు. సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు ఇద్దరు నేతలను గజ్వేల్ సభకు తీసుకు వెళ్తారు. గజ్వేల్ లో సభ ఏర్పాట్లు… వేదిక బాధ్యత అంతా సీనియర్ నేత గీతా రెడ్డీ, దామోదర రాజనర్సింహకు అప్పగించారు. గజ్వేల్ సభ లో సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలకు సంబంధించి ఛార్జిషీట్ విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ చార్జిషీట్‌లో భాగంగా టీఆర్ఎస్ వైఫల్యాలపై బుక్ విడుదల చేయనుంది. సభ విజయవంతం కోసం భారీగా జన సమీకరణ చేస్తోంది. లక్ష మందిని గజ్వేల్ సభకు రప్పించి.. సత్తా చాటాలని భావిస్తోంది.