అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహశీల్దార్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి చిక్కారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
read also: India Air Force: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతుళ్లు.. ఐఏఎఫ్ చరిత్రలో తొలిసారి!
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన రైతు శ్రీరాములు, చిన్న ఆముదాలపాడు గ్రామంలోని సర్వే నంబరు 63/ఏ2 లో 2.34 ఎకరాల భూమిని కొత్తపేట మాణిక్యమ్మ నుంచి 2020లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే.. ఇదే సర్వే నంబరులో తన సోదరుడు ఎల్లస్వామి కూడా 2.22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కాగా..ధరణి పోర్టల్‌లో తాము కొనుగోలు చేసిన భూమి వివరాలను సరిచూసుకోగా భూదానం కింద నమోదు కావడాన్ని గుర్తించారు. దీంతో.. గత అక్టోబరులో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే జూన్ 10న శ్రీరాములు అన్న ఎల్లస్వామి భూమిని ధరణి పోర్టల్‌లో భూదానం నుంచి తొలగించినట్లు సమాచారం అందింది. దీనిపై శ్రీరాములు అదే నెల 19న తహసీల్దార్ వీరభద్రప్పను, సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను కలిశారు. అయితే.. వారు రూ.10వేలు డిమాండు చేశారు. అంత డబ్బులు చెల్లించలేనని తెలపడంతో.. చివరికి రూ.7,500కు బేరం కుదిరింది. అయితే..ఆవేదన చెందిన రైతు , ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో శ్రీరాములు నుంచి సాయిబాబ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.