హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.. కాస్త గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ ముసురు అందుకుంటోంది.. దీంతో, బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.. అయితే, మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను ఓసారి పరిశీలిస్తే.. నిన్నటి తీవ్ర అల్పపీడనం బలపడి ఈ రోజు దక్షిణ ఒరిస్సా తీరం మరియు పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Read Also: Revanth Reddy: మన ఊరు – మన బడి ఓ ప్రచారార్భాటం
ఇక, నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టానికి 3.1 కిలో మీటర్ల నుండి 7.6 కి మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉందని తెలిపింది.. ఈ రోజు రుతుపవన ద్రోణి బికానర్ , కోట, మాలాంజ్ ఖండ్, రాయిపూర్,తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తన ప్రకటనలో పేర్కొంది వాతావరణశాఖ.. వీటి ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.. మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.