World Best Selling Smartphone in 2025: ప్రస్తుతం ‘స్మార్ట్‌ఫోన్’ నిత్యావసర వస్తువుగా మారింది. ఆహారం, దుస్తులు, నివాసం, విద్య అనంతరం ఐదవ అవసరంగా స్మార్ట్‌ఫోన్ మారింది. ఎందుకంటే కమ్యూనికేషన్, ఆన్‌లైన్ విద్య, బ్యాంకింగ్, షాపింగ్, జాబ్స్ కోసం తప్పనిసరి అయింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ఏ ఫోన్ ట్రెండింగ్‌లో ఉందో తెలుసుకోవాలని కోరుకుంటారు. గ్లోబల్ హ్యాండ్‌సెట్ మోడల్ సేల్స్ ట్రాకర్ ప్రకారం.. ‘ఐఫోన్ 16’ 2025 మూడవ త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌గా మారింది.
టాప్ 10లో యాపిల్, శాంసంగ్‌లు చెరో ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీల మోడల్స్ ఈ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మొదటి ఐదు స్థానాలను 5G స్మార్ట్‌ఫోన్‌లు ఆక్రమించాయి. ఇది మూడో త్రైమాసికంకి కొత్త రికార్డు. ఐఫోన్ 16 ఫోన్ 4 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. వరుసగా మూడవ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. భారతదేశంలో పండుగ డిమాండ్, ధర తగ్గడం ఐఫోన్ 16 అమ్మకాలకు కలిసొచ్చాయి. యుఎస్, యూకే, చైనా వంటి కీలక మార్కెట్లలో ఐఫోన్ 16 ప్రో మోడల్స్ అమ్మకాల్లో స్వల్ప క్షీణతను చవిచూశాయి. కానీ స్టాండర్డ్ ఐఫోన్ 16 సేల్స్ మాత్రం బాగున్నాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్ టాప్-10లో ఉంది.
టాప్ 10 స్థానాల్లో ఐదు స్థానాలను శాంసంగ్ దక్కించుకుంది. గెలాక్సీ A సిరీస్ మోడల్‌లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. గెలాక్సీ A16 5G అత్యధికంగా అమ్ముడైన మోడల్. AI ఫీచర్లు, మెరుగైన కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా గెలాక్సీ A36, A56 వంటి మధ్య-శ్రేణి ఫోన్‌లకు కూడా మంచి డిమాండ్ ఉంది. గెలాక్సీ A16 4G, Galaxy A06 వంటి LTE మోడల్‌లు ఇప్పటికీ లాటిన్ అమెరికా, MEA మార్కెట్లలో ప్రజాదరణ పొందాయి. ఇక్కడ 4G ఫోన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మధ్యస్థ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లలో GenAI లక్షణాలకు పెరుగుతున్న ప్రజాదరణ ఈ విభాగాన్ని టాప్ 10లో ఉంచింది. 2025 మూడవ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ ఇదే.
టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్:
# ఐఫోన్ 16
# గెలాక్సీ A16 5G
# గెలాక్సీ A36
# గెలాక్సీ A56
# గెలాక్సీ A16 4G
# గెలాక్సీ A06
# ఐఫోన్ 16 ప్లస్
# ఐఫోన్ 16 ప్రో
# ఐఫోన్ 16 ప్రో మాక్స్
# ఐఫోన్ 17 ప్రో మాక్స్