సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని పలువురు వినియోగదారులు వాట్సాప్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో యూజర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు కమ్యూనిటీ బ్లాగ్ ఆఫ్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్‌తో 2 జీబీ సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను సైతం షేర్ చేసుకోవచ్చు. ముందుగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలోని బీటా యూజర్లకు ప్రవేశపెట్టనుంది. ఈ టెస్టింగ్ విజయవంతం అయితే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. కాగా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తున్న టెలిగ్రామ్ ఇప్పటికే 1.5 జీబీ డేటాను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 2020 నుంచి టెలిగ్రామ్ ఈ అవకాశం వినియోగదారులకు కల్పిస్తోంది. దీంతో కొంతమంది వాట్సాప్ యూజర్లు టెలిగ్రామ్‌కు మారాల్సిన పరిస్థితి నెలకొంది.