స్మార్ట్ ఫోన్ వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ లేకుండా నిమిషం ఉండలేని పరిస్థితి. అవతలి వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్ మేషన్ ఇవ్వాలన్నా.. పొందాలన్నా.. క్షణాల్లో కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు సిగ్నల్ ప్రాబ్లం వేధిస్తుంటుంది. మీ మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగా అందక కాల్ చేయలేకపోతుంటారు. టవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మారు మూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఇకపై ఈ సిగ్నల్ సమస్య ఉండదు. సిగ్నల్ లేకపోయినా కాల్ చేయొచ్చు. ఎలా అంటే.. కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్లు తాము యూజ్ చేస్తున్న నెట్ వర్క్ సిగ్నల్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఇతర నెట్ వర్క్ ల సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. జియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), భారతీ ఎయిర్‌టెల్ యూజర్లు సొంత సిమ్ నెట్ వర్క్ లేకపోయినా అక్కడ అందుబాటులో ఉన్న ఏ నెట్ వర్క్ నుంచైనా కాల్ చేసుకోవచ్చు.
అంటే మీరున్న ప్లేస్ లో మీ నెట్ వర్క్ కు సంబంధించిన టవర్ లేకున్నా ఐసీఆర్ ఫీచర్ తో ఇతర నెట్ వర్క్ లను యూజ్ చేసుకుని కాల్ చేయొచ్చు. 4జీ సేవలను కూడా పొందొచ్చు. అయితే ఈ ఫీచర్ డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా ఏర్పాటైన 4జీ టవర్ల పరిధిలో అందుబాటులో ఉంటుంది. డీబీఎన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఈ సేవలను పొందొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 35,400 మారుమూల గ్రామాల పరిధిలో 27 వేల టవర్లను ఏర్పాటు చేసింది.