రేపు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం చేరుకోనున్నారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకోనున్నారు.
రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8,790 క్యూసెక్కుల ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను చర్చించారు.