CM Revanth Reddy: రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పామన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ ముందుకు తెస్తామని సీఎం తెలిపారు. చర్చల అనంతరం డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచనల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు.
Read Also: Medigadda: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ రెవెన్యూ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో ఆర్టీసీకీ నిర్వహణ నష్టాలు తగ్గాయన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకా ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా.. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని.. కొత్తవారిని నియమించిన అనంతరం కులగణన చేస్తామన్నారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. ప్రతి నెలా రూ.7వేల కోట్ల అప్పులు కడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రుణభారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో ఉన్నామన్నారు. ఒక్క శాతం తగ్గినా రూ.700 కోట్లు ఆదా అవుతాయన్నారు.