Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఢిల్లీలో మకాం వేశారు. కీలకమైన పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు క్యాబినెట్ విస్తరణపై కూడా జోరుగా మంత్రాంగం నడుస్తోందట. దీంతో సామాజిక సమీకరణలపై మరోసారి చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో.. పీసీసీ చీఫ్ నియామకంలో బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ మొదట్నుంచి ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి, ఎస్సీ కేటగిరీలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఉన్నందున జనాభాలో సగం ఉన్న బీసీలకు ఖచ్చితంగా పీసీసీ చీఫ్ ఇవ్వాల్సిందేన్నన డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం జరుపుతున్న మేధోమధనంలో హై కమాండ్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీ కోటాలో రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేరు ముందు వరుసలో ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అలాగే మధుయాష్కి పేరు కూడా బాగానే నలుగుతోంది. అదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోందట. పీసీసీని బీసీకి ఇస్తే… సామాజిక సమతుల్యంలో భాగంగా.. ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లోని ఇతర సామాజికవర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ఉన్నవారికి తిరిగి అవే పదవులు దక్కే అవకాశం కనిపించడం లేదట. జగ్గారెడ్డి లాంటి నేతలు తిరిగి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చేపట్టేందుకు అంత ఆసక్తిగా లేరని కూడా తెలుస్తోంది.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ. కానీ.. ఈసారి మూడేళ్ళ క్రితం ఆ పోస్ట్‌ను భర్తీ చేశారు. అందుకే ఈసారి కొత్త ఛైర్మన్‌ని నియమిస్తారని, బహుశా అది జగ్గారెడ్డికి దక్కవచ్చన్నది పార్టీ వర్గాల సోర్స్. కానీ.. పార్టీ నాయకులంతా ఢిల్లీ బాట పడితే.. జగ్గారెడ్డి మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. దీంతో తన తరపున మాట్లాడే బాధ్యత ఎవరికి ఇచ్చారన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఇక కేబినెట్ విషయానికి వస్తే… కొత్తగా ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కానీ ప్రస్తుతానికి నాలుగు లేదంటే ఐదు బెర్త్‌లే భర్తీ చేసే అవకాశం ఉందట. సంఖ్య ఎంతున్నా సరే… అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ పెరిగింది. మంత్రివర్గంలో రెడ్ల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందన్న టాక్ ఇప్పటికే నడుస్తోంది. అటు పార్లమెంటు సీట్ల విషయంలో ఎస్సీ సామాజిక వర్గంలోని మాలలకే పెద్ద పీట వేశారన్న అసంతృప్తి ఆ వర్గాల్లో కనిపిస్తోంది. కేబినెట్‌లో ఆదిలాబాద్ జిల్లా నుంచి చోటు కోసం పాత కాంగ్రెస్, ఇటీవలే పార్టీలోకి వచ్చిన కుటుంబం మధ్య తీవ్ర పోటీ ఉందట. ఈసారి మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. అలాగే అదిలాబాద్ జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గం నేతలు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఇద్దరి మధ్య పంచాయతీ కంటే మూడో వ్యక్తికి పదవి ఇస్తే ఎలా ఉంటుందని చర్చ కూడా జరుగుతోందట పార్టీలో.
ఇక కాంగ్రెస్ తమను చిన్నచూపు చూస్తోందనిన భావన గిరిజన నేతల్లో బలపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉన్న ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా రేస్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు చర్చ నడుస్తోంది. అదే జరిగితే నల్గొండ నుంచి ముగ్గురు మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారు. అప్పుడు మిగతా సామాజిక వర్గాల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు. అటు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లిమరీ… సీఎం రేవంత్ రెడ్డికి తన మనసులో మాట చెప్పుకున్నారట ఆయన. గిరిజన కోటాలో తనకు ఛాన్స్ కావాలని వత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నారు బాలు నాయక్. అలాగే క్యాబినెట్ విస్తరణలో బీసీలకు చోటు కల్పించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే. కేబినెట్ విస్తరణలో అవకాశం ఉండకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజామాబాద్ జిల్లా కోటాలో పిసిసి చీఫ్ పదవి మహేష్ గౌడ్ కి ఇస్తే సామాజిక సమీకరణాలు కొంత లెక్క కుదిరిందన్న భావన కలుగుతుంది. ఇక మాదిగల కు ప్రాతినిధ్యం కల్పించాలని అనుకుంటే ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారన్న చర్చ కూడా నడుస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వద్దని నిబంధన పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైనా పిసిసి అధ్యక్ష పదవి కోసం పట్టుబడితే… అదో ఇదో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా హస్తినకు పరిమితమై ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో సామాజిక సమీకరణల్ని ఎంత వరకు వర్కౌట్ చేస్కారన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో..