Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో హేమాహేమీల్లాంటి నాయకులున్నారు. అధికారం, ప్రతిపక్షం అన్నదాంతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఛరిష్మాతో రాజకీయాలు నడపగల సామర్ధ్యం ఉన్నవాళ్ళే. కానీ…. ఇప్పుడు అలాంటి నేతలంతా ఏమైపోయారు? ఎక్కడున్నారంటూ పార్టీ కేడర్ భూతద్దం పట్టుకుని వెదుకుతోందట. ప్రతిపక్షంలో ఉండి… అంతా కలిసి పనిచేయాల్సిన టైంలో సీనియర్ నాయకులు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారన్నది వాళ్ళ ప్రశ్న. పరిణితితో ఆలోచించాల్సిన నేతలే గిరి గీసుకుని కూర్చుంటున్నారని, దానివల్ల జిల్లాలో పార్టీకి దిశా నిర్దేశం లేకుండా పోతోందన్న ఆందోళన ద్వితీయ శ్రేణిలో సైతం వ్యక్తం అవుతోంది. వాళ్ళంతా ఒక్క తాటి మీదికి రాకుండా ఏవేవో అడ్డొస్తున్నాయన్న గుసగుసలు సైతం ఫ్యాన్ కార్యకర్తల్లో ఉన్నాయి. కీలక నాయకుల మధ్య సమన్వయం లేక పార్టీ డ్యామేజ్ అవుతోందంటున్నారు. పెద్దోళ్లు ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల పలు నియెజకవర్గాలలో గిల్లికజ్జాలు చినికి చినికి గాలివానగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఐకమత్యంతో పోరాడాల్సిన మా నాయకులు ఎవరికి వారు మాకెందుకన్నట్టు ఉంటున్నారని, చివరికి పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాల మీద కూడా దృష్టి పెట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది కేడర్.
జిల్లాలో పార్టీకి మునుపటి స్థాయి రావాలంటే కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, అంతకంటే ముందు సీనియర్స్ జోక్యం చేసుకుని పలు నియోజక వర్గాలలో కొనసాగుతున్న విబేధాలను ఆదిలోనే అడ్డుకోవాలని అంటున్నారు కార్యకర్తలు. ముఖ్యంగా… ధర్మాన సోదరులు, తమ్మినేని లాంటి వాళ్ళు చోద్యం చూస్తున్నారన్నది ద్వితీయ శ్రేణి అభిప్రాయం. కొన్ని చోట్ల అయితే… అసలు ద్వితీయ శ్రేణి నేతలే గ్రూపులకు కారణం అవుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళను కట్టడి చేయాలంటే…. సీనియర్స్ జోక్యం తప్పని సరి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో. సమస్యల్ని పరిష్కరించాల్సిన బడా నేతలే ఒక్కో వర్గానికి కొమ్ముకాస్తున్నడం తీవ్రతను పెంచుతోందని చెప్పుకుంటున్నారు.నియోజకవర్గ ఇన్చార్జ్‌లకు సహాయ నిరాకరణ చేస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కింది స్థాయిలో దిశా నిర్దేశం చేయడంలో సీనియర్స్ విఫలమవుతున్నారన్నది జిల్లా పార్టీలో ఉన్న విస్తృతాభిప్రాయం. ఇచ్చాపురం, టెక్కలి, రాజాం, ఆమదాలవలస నియెజకవర్గాల్లో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయట. ఇచ్చాపురంలో తాజాగా ఇన్ఛార్జ్ మార్చాక విబేధాలు తారా స్థాయికి చేరినట్టు తెలుస్తోంది.
ఇక్కడ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయింది. టెక్కలిలో కూడా కేడర్ మొత్తం తిలక్ వెంట నడిచే పరిస్తితి లేదంటున్నారు. ఆమదాలవలస, రాజాంలో కూడా ఈ కోల్డ్ వార్ కొనసాగుతోందట. అంతా కలిసికట్టుగా ఉంటామంటూ ఇన్ఛార్జ్ సమక్షంలో తలూపే నాయకులు తీరా నియోజకవర్గాలకు వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటున్నారట.
పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బోర్లా పడడం ఖాయం అన్నది వైసీపీ కేడర్ ఫీలింగ్. ఇగోలను పక్కన పెట్టి, చిన్న చిన్న మనస్పర్ధలను తొలగించుకుని పెద్ద నాయకులంతా ఏకతాటిపైకి వస్తేనే జిల్లాలో పార్టీకి పునర్ వైభవం సాధ్యమన్నది ఫ్యాన్ కార్యకర్తల మాట.