అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రాగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!' అంటూ ట్వీట్ చేశారు.
అమరావతి మాస్టర్ ప్లాన్‌పై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌తోనే ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఆ దిశగా నివేదిక రెడీ చేసి ప్రజల అభిప్రాయంతో నిర్మాణం చేపడతామన్నారు.
రేపటి(శుక్రవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.