సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలు అని విమర్శించారు.
సిద్దిపేటలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట కల నెరవేరిందని అన్నారు. దసరా పండుగ లోపు సిద్దిపేటకి రైలు తెస్తాను అని గత దసరా రోజున చెప్పానన్నారు. ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
కాళేశ్వరం గొప్ప గురించి కేసీఆర్ చెప్పారని.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా దెబ్బ తిన్నదో తెలుస్తోందని పొంగులేటి విమర్శించారు. దీనికి కారకులు ఎవరూ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఏటీఎంగా కేసీఆర్ కు ఉపయోగపడిందని అన్నారు. కాళేశ్వరం పై మొదటి నుంచి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజం అయ్యాయని.. సీవీసీ చేత విచారణ జరపాలని కోరారు.
తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు.
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహింహులు పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి హల్చల్ చేశారు. కేసీఆర్ ను సమర్థించి తప్పుచేశానన్నారు. దళితబంధు అమలు కాకుంటే తాను చస్తానని గతంలో చెప్పానని.. ఇప్పుడు దళితబంధు అమలు కావటం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. దళిత యువత తనకు మెసేజ్ లు చేసి తనను చనిపోమని అంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం అని ఆయన కామెంట్స్ చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం రెడీ అయింది. కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ప్రచార రథం సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమావేశం కానున్నారు. పార్టీ అభ్యర్థులకు గులాబీ బాస్ బీ-ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం.. అనంతరం 12.15 నిమిషాలకు మ్యానిఫెస్టో విడుదల, మ్యానిఫెస్టోపై ప్రసంగం చేయనున్నారు.
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం... కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు.