N Convention Demolish: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధకారులు కూల్చివేస్తున్నారు.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
ఇంతకి ఇది హైడ్రా నా హై డ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు యే ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు.
హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.
తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విధివిధానాలు విడుదల చేసింది. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఉండనున్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్, రంగారెడ్డి ఇంఛార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసి మేయర్, సీఎస్, డీజీపీ, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీలు హైడ్రాలో సభ్యులుగా ఉంటారు.
సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధివిధానాలపై చర్చిస్తున్నారు.