ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముచ్చటగా తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్‌కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
బీహార్ పరిణామాలతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతుందో అర్థం కాక నేతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు సింగిల్‌గానే లోక్‌సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా ఇండియా కూటమికి రాంరాం చెప్పబోతున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఈ అనిశ్చితితో కూటమి నేతలు కన్‌ఫ్యూజ్‌తో తలలు పట్టుకుంటున్నారు. క్షణక్షణం రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. లేటెస్ట్‌గా నితీష్ ఇస్తు్న్న ట్విస్టుతో నేతలంతా అయోమయానికి గురయ్యారు.
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తాజా పరిణామాలు, జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కూడా చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్‌కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది.