ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్‌కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో నితీష్‌కుమార్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి లేఖ సమర్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
CM Revanth: ఆ లబ్ధిదారులకు తులం బంగారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి..
ఇదిలా ఉంటే ప్రభుత్వంలో ఇంత అనిశ్చితి ఏర్పడినా.. ఇప్పటి వరకూ నితీష్‌కుమార్ ఎక్కడా అధికార ప్రకటన చేయలేదు. బీజేపీతో కలిసి వెళ్లాలని నితీష్ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ జేడీయూ నుంచి కానీ.. ఆర్జేడీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రెండు పార్టీల మధ్య అయోమయం.. గందరగోళం నెలకొంది. దీనికంతటికి ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలిసి నితీష్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ పరిణామాలే బలం చేకూర్చాయి. పైగా ఈ ప్రోగ్రామ్‌కి ఆర్జేడీ నేతలెవ్వరూ హాజరుకాలేదు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మితిమీరిన జోక్యం ఎక్కువైపోయిందని.. అందుకే ఆర్జేడీని నితీష్ నమ్మలేకపోతున్నారని జేడీయూ కీలక నేత ఒకరు చెప్పుకొచ్చారు. పైగా ఇండియా కూటమి అధ్యక్షుడిగా నితీష్‌ను నియమించకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మల్లిఖార్జున ఖర్గేకే ఆర్జేడీ మద్దతు తెలిపింది. ఈ పరిణామం నితీష్‌కు రుచించలేదని తెలుస్తోంది. ఈ సంఘటనలే రాజకీయ సంక్షోభానికి కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి.