దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా చేశారు. రిటైరైన తర్వాత సర్వీసులో కొనసాగనిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే కరికాల వలవన్ రాజీనామా చేశారు.
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 'ప్రజా దర్బార్' ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు.