నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆయన ఆరా తీశారు. నరసాపురం ఫెర్రి బకాయిలు అందించాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్ గేటును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ఓపెన్ చేయించారు. గత ప్రభుత్వం గేట్-2 మూసేసి నిర్మించిన గోడను పడగొట్టించి గేట్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టించారు. రైతుల కష్టాలు వినపడకూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించామని ఆయన అన్నారు.
రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని ఆయన కొనియాడారు.
ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి చెందాడు. కె.లూధియారావు అనే మార్షల్‌కు ఉదయం విధుల్లో ఉండగా గుండెపోటు రాగా.. వెంటనే తోటి సిబ్బంది మంగళగిరి ఎన్నారై హాస్పటల్‌కు తరలించారు.
గుంటూరులో 2022న జరిగిన ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత అనుమానాస్పద మృతి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నల్లపాడు పోలీసుల తీరుపై, ఓ పక్కన బాధితులు మరో పక్కన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు.
తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతోంది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై సీఎంవో ఆరా తీస్తోంది.