AP Cabinet Meeting: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమై నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించే విధంగా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తమ హయాంలో ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తున్నారు.
బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. రేపు సెక్రటేరీయేట్లో బీసీ మంత్రులు భేటీ కానున్నారు. రేపు మూడు గంటలకు 8 మంది బీసీ మంత్రులు భేటీ కానున్నారు. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
రేపు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ నూతన పాలసీలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానంలో ప్రణాళికలను రచించారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల సంచారం వల్ల రాజారెడ్డి అనే రైతు దుర్మరణం పాలైన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపై సెస్ విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సెస్ ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం తయారీ అమ్మకాన్ని దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. లిక్కర్లో 40 వేలకోట్లు దోచుకున్నారని, 60 రూపాయలు వున్న క్వార్టర్ బాటల్ 250కి అమ్ముకున్నాడని విమర్శించారు.