Minister Kollu Ravindra: మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు సిగ్గు చేటన్నారు. ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి మద్యాన్ని దోచుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తయారీ నుంచి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నది నిజం కాదా అంటూ అడిగారు. జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ షాపుల్లోనే వేలాది ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24 మధ్య అక్రమ మధ్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయన్నారు. మన రాష్ట్రంతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు అంతా ఆదాయం తేడా వచ్చిందో సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న, దేశ వ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా పాలసీ తీసుకొచ్చామన్నారు.
Read Also: Lanka Dinakar: 2047 స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబు లక్ష్యం
రూ.99 కే క్వార్టర్ మద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి ధరల్ని నిర్ణయించబోతున్నామని మంత్రి తెలిపారు. నీతులు చెప్తున్న జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన మద్యం అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. త్వరలోనే కల్లు గీత కార్మికులకు కేటాయించిన షాపులకు త్వరలోనే దరఖాస్తులు పిలుస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు జరిగిందన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో 89,882మంది దరఖాస్తు చేసుకున్నారని.. షాపులు ఏర్పాటు చేశారన్నారు. రీహాబిలిటేషన్ కోసం అదనంగా 2 శాత సెస్ అమలు చేస్తున్నామన్నారు. ఆదాయం పోయిందనే బాధతో జగన్ రెడ్డి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు అని గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్రంలో 130 ఇసుక రీచులు ఎందుకు మూతబడ్డాయో సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే జూలై 8 న ఉచిత ఇసుక పాలసీని ప్రకటించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలకు ఎన్జీటీ అడ్డుకోవడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనా కాలంలో ఏ రోజైనా అందుబాటులో ఉన్న ఇసుక వివరాలు బయట పెట్టారా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. విలువలు వదిలేసి రాజకీయం చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందన్నారు. ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చి ఎవరైనా ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చని నిర్ణయించామన్నారు. 8 జిల్లాల్లో డీ సిల్టేషన్ కోసం అనుమతులు ఇచ్చి ఇసుక అందుబాటులో ఉంచామన్నారు. ఓపెన్ టెండర్లపై కూడా జగన్ రెడ్డి విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ఐదేళ్లు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీనరేజి వసూళ్లను కూడా ఉపసంహరించుకున్నామన్నారు.