Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
Story Board: పశ్చిమ బెంగాల్ లో మమత వర్సస్ బీజేపీ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 2021 లోనే ఈ రెండు పక్షాల మధ్య రాజకీయ యుద్దం తారా స్థాయిలో జరిగింది. అప్పటి నుంచే 2026 ఎన్నికలే లక్ష్యంగా రెండు వైపులా వ్యూహాలకు పదును పెట్టారు. మమతా తన పాలన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే ధీమాతో ఉన్నారు. అయితే, చొరబాట్లు.. ప్రభుత్వం పైన వ్యతిరేకత.. హిందుత్వ అజెండా తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ముఖ్య నేతలంతా బెంగాల్ లో ఇప్పటికే ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత మమతకు అనుకూలంగా ఉన్న పలువురు అధికారులను బదిలీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక సర్ కోసం వచ్చిన ఎన్నికల అధికారుల్ని ఘెరావ్ చేయడంతో.. సుప్రీంకోర్టు కూడా బెంగాల్ యంత్రాంగంపై సీరియస్ అయింది.
బెంగాల్లో నాలుగోసారి అధికారం కోసం మమత చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. ఎలాగైనా బెంగాల్ ఉట్టి కొట్టాలని బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఒంటరి పోరు చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయనేది తేలాల్సి ఉంది. ఏతావాతా బెంగాల్ ఎన్నికలు టీఎంసీకి అగ్నిపరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో గెలిచినా.. బీజేపీ మమతను టెన్షన్ పెట్టింది. ఈసారి కూడా కాషాయ పార్టీ హడావుడి ఎక్కువగానే ఉంది. దీంతో దీదీ కూడా దీటైన కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మరోసారి బెంగాల్ కూతురు సెంటిమెంట్ ప్రయోగిస్తున్న మమత.. బలమైన సంస్థాగత పునాదులే కాపాడతాయనే నమ్మకంతో కనిపిస్తున్నారు.
బెంగాల్ శాసనసభకు 294 స్థానాలకు గాను ఈ నెల 23, 29.. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. బెంగాల్లో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. 2011లో వామ పక్ష ప్రభుత్వ పాలన అంతరించిన తర్వాత మమతా బెనర్జీ బలమైన నాయకురాలిగా ఎదిగారు. బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న దీదీకి తాజాగా పెను సవాల్ ఎదురవుతోంది. బెంగాల్లో ఇక తనకు ఎదురు లేదని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీకి షాక్ ఇచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఈసారి కూడా బీజేపీ, టీఎంసీ మధ్యే హోరాహోరీ పోరు జరిగేలా ఉంది.
బెంగాల్ ఎన్నికల్లో గెలుపుకు మహిళా ఓటర్లు కీలకంగా మారారు. మమత ఓటర్లుగా ముద్రపడ్డ మహిళల్ని తనవైపుకి తిప్పుకోవటానికి బీజేపీ వారిపై వరాల జల్లు కురిపిస్తోంది. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో, తృణమూల్ కాంగ్రెస్ లక్ష్మీర్ భండార్, బీజేపీ మాతృశక్తి వందన్ యోజన మధ్య పోటీ పరోక్షంగా ఊపందుకుంది. లక్ష్మీర్ భండార్ పథకం తృణమూల్‌కు ఎంతో కాలంగా అచ్చొచ్చిన పథకం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీని అధిగమించడంలో ఈ స్కీమే టీఎంసీకి శ్రీరామరక్షగా నిలిచింది. అంతే కాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయానికి దోహదపడింది. సాధారణ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500, షెడ్యూల్డ్ వర్గాల మహిళలకు రూ.1,700 అందించే ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 2.42 కోట్లకు చేరుకుంది. మమత మహిళా ఓటుబ్యాంక్‌ను కొల్లగొట్టాలనే ప్లాన్‌తో ఉన్న బీజేపీ.. తన మ్యానిఫెస్టోలో.. బెంగాల్లో ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది. అలాగే గర్భిణిలకు రూ.21 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ దెబ్బతో లక్ష్మీర్ భండార్ పథకం పనిచేయదని కాషాయ పార్టీ లెక్కలేస్తోంది.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనే నినాదంలో భాగంగా.. ఈసారి బెంగాల్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ అగ్రనాయకత్వం పకడ్బందీ ప్రణాళికతో ఉంది. గత ఎన్నికల్లో 77 స్ధానాలు మాత్రమే గెలుచుకున్నప్పటికీ 39 శాతం ఓట్లు సాధించి విజయం అసాధ్యమేమీ కాదన్న ఆత్మవిశ్వాసం పోగుచేసుకుంది. అదే ఊపులో ఈసారి పంచముఖ వ్యూహంతో ఆ పార్టీ పథక రచన చేస్తోంది. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌కు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. సమర్ధులైన అభ్యర్ధుల ఎంపికతోపాటు, అక్కడి సమాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా అధిష్టానం వ్యూహాలను క్షేత్రస్ధాయిలో అమలు చేయడం వారి బాధ్యత. మోడీ ఛరిష్మా ఎలాగూ తమకు ప్రధానాస్త్రం కానుందని ఆ పార్టీ చెబుతోంది. టీఎంసీ 15 ఏళ్ల పాలనపై వ్యతిరేకత, సందేశ్‌ఖాలీ, ఆర్.జి.కర్ వంటి సున్నితమైన అంశాలను హైలైట్ చేస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం బీజేపీకి ప్రధానాస్త్రాలు. అలాగే సీఏఏ ద్వారా మథువా ఓట్లను కన్సాలిడేట్ చేయడం బీజేపీ ప్రధాన లక్ష్యం. దీనికి తోడు టీఎంసీ ఓటు బ్యాంకును చీల్చే వర్గాలను గుర్తించి వారితో పొత్తులు, లేదా విడిగా పోటీచేయించే ఎత్తులు కూడా బీజేపీ వేస్తోంది.
జాతీయ వాద ఓటర్లను కూడగట్టడంలో బీజేపీ ముందుంటే ప్రాంతీయ వాదాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో మమత సిద్దహస్తురాలు. ‘మా-మాటీ-మానుష్’ వ్యూహంతో విపక్షాల దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో వుంది. బీజేపీని బయటి పార్టీగా ముద్ర వేయడం, బెంగాలీ సంస్కృతిని కాపాడేది తానేనని ప్రజల్లోకి వెళ్లడం మమత ప్రధాన ప్రచారాస్త్రం. లక్ష్మీర్ భండార్ ద్వారా మహిళలకు అందుతున్న ఆర్థిక సాయం, మైనారిటీల కోసం పెంచిన గౌరవ వేతనాలు వంటివి ఆమెకు బలమైన ఓటు బ్యాంకును సృష్టించాయి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఓబీసీ వర్గాల కోసం కొత్తగా ఐదు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి సోషల్ ఇంజనీరింగ్‌కు తెరలేపారు దీదీ.
ఏ పార్టీ వ్యూహం ఎలా ఉన్నా.. బెంగాల్లో దాదాపు 30 శాతం వరకు ఉన్న ముస్లిం ఓటర్లు ఎప్పుడూ టీఎంసీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. సీఏఏ, ఎస్ఐఆర్ వంటి బీజేపీ విధానాలు ఈసారి కూడా మైనారిటీ ఓట్లు తమవైపే కన్సాలిడేట్ అవుతాయన్న నమ్మకంతో మమత ఉన్నారు. అసలు 33 శాతం మైనారిటీల్లో అత్యధికులు మమతకు ఓటు వేయటమే దీదీ వరుస విజయాలకు కారణం. కానీ ఈసారి సీన్ మారుతుందని బీజేపీ మొదట్లో అంచనా వేసింది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మత పెద్దల మద్దతుతో యువతలో క్రేజ్ సంపాదించింది. దక్షిణ బెంగాల్లో టీఎంసీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. AIMIM (ఒవైసీ)గత ఎన్నికల్లో విఫలమైనా, ఈసారి మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో గట్టిగా పోటీ చేసి తన ఉనికిని చాటాలని చూస్తోంది. టీఎంసీ మాజీ నేత కబీర్ పెట్టిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ(JUP) మైనారిటీ అసంతృప్త ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ పార్టీలన్నీ కలిసి లెఫ్ట్-కాంగ్రెస్ కూటమితో జతకడితే, మైనారిటీ ఓట్లు భారీగా చీలిపోయి అల్టిమేట్‌గా బీజేపీకి మేలు జరుగుతుందనేది ఆ పార్టీ తొలి అంచనా. కానీ అనూహ్యంగా వెలుగుచూసిన కబీర్ స్టింగ్ ఆపరేషన్ వీడియోతో సమీకరణాలు మళ్లీ సంక్లిష్టంగా మారాయి. మైనార్టీ ఓట్ల చీలిక కోసం పనిచేయటానికి తనకు ఏకంగా పీఎంఓ నుంచే డబ్బు అందిందని కబీర్ చెబుతున్న ఆడియో వీడియోతో సహా లీకైంది. దీంతో టీఎంసీ వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఎంఐఎం కూడా అప్రమత్తమై కబీర్ పార్టీతో పొత్తు తెంచుకుంది. కానీ ఏం చేసినా..మైనార్టీలు ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారనేది ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పటానికి సందేహించాల్సిన పని లేదు.
బెంగాల్లో మైనార్టీలతో పాటు మథువాలు కీలకంగా ఉన్నారు. విభజన సమయంలో, ఆ తర్వాత బంగ్లాదేశ్ శరణార్థులుగా బెంగాల్‌కు వలస వచ్చిన హిందూ దళితులు మథువా వర్గీయులు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మథువా ఓటు బ్యాంక్ ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల అత్యంత శక్తివంతమైన అంశం. బెంగాల్ జనాభాలో సుమారు 17 నుంచి 20 శాతం వరకు ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఉత్తర 24 పరగణాలు, నదియా సరిహద్దు జిల్లాల్లో వీరికి భారీ పట్టు ఉంది. బెంగాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో మథువా ఓటర్లు గెలుపోటములను శాసించగలరు. గతంలో వామపక్షాలకు, ఆ తర్వాత మమతా బెనర్జీకి మథువాలు అండగా నిలిచారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల నుంచీ మథువాలు బీజేపీకి మొగ్గుచూపుతున్నారు. దశాబ్దాలుగా మథువాలు ఎదురుచూస్తున్న అంశం శాశ్వత పౌరసత్వం. CAA అమలును వేగవంతం చేయడం ద్వారా మథువాలకు పౌరసత్వం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ఆశతోనే తమకి జై కొడుతున్న మథువాలు.. మరోసారి మద్దతిస్తారని బీజేపీ అంచనా వేస్తోంది.
గత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన లెఫ్ట్ పార్టీలు ఈసారి చావోరేవో తేల్చుకోవాలని చూస్తున్నాయి. ముహమ్మద్ సలీం నాయకత్వంలో యువ అభ్యర్థులకు పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన పట్టున్న ఉత్తర బెంగాల్ జిల్లాలపై దృష్టి సారించింది. వీరు మైనారిటీ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే టీఎంసీ గెలుపును పరోక్షంగా ఆపగలవు తప్ప స్యయంగా పూర్వ వైభవం దక్కించుకునే అవకాశం లేదు. చివరిగా బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ భావోద్వేగాల మీద నడుస్తాయి. ఓ వైపు హిందూ ఓట్లను ఏకం చేయాలని బీజేపీ, మరోవైపు మైనారిటీలు, మహిళల మద్దతుతో కోటను కాపాడుకోవాలని టీఎంసీ చూస్తున్నాయి. కానీ మైనారిటీ పార్టీలు, మథువాల వంటి సమాజిక వర్గాలు ఎన్ని ఓట్లు చీలుస్తాయనే దానిపైనే బెంగాల్ సింహాసనం ఎవరికి దక్కుతుందనేది ఆధారపడి ఉంటుంది. అంతిమంగా ప్రస్తుతం బెంగాల్లో ప్రతి ఓటూ కీలకమే. మెజార్టీ నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీలే వస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో తొలి దశ ఎన్నికలకు సమయం దగ్గరపడ్డ తరుణంలో.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటరు జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 7 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చింది. అయితే ఈ అదనపు ఓటర్ల వయసు, వారు పురుష లేదా మహిళా ఓటర్లా అనే విషయాన్ని ఈసీ వెల్లడించలేదు. అలాగే ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం అందిన ఫారం-6 దరఖాస్తుల సంఖ్యను గానీ, వాటిలో ఎన్ని తిరస్కరణకు గురయ్యాయో అనే విషయాన్నీ గోప్యంగా ఉంచుతోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బెంగాల్ ఓటరు జాబితాల్లో లక్షలాది మందిని చేర్చడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంపై టిఎంసి, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటిదశ పోలింగ్‌లో ఓటు వేయనుండగా, మిగిలిన 3.88 లక్షల మంది ఓటర్లు రెండో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా మొత్తం గణాంకాలను విడుదల చేశామని పేర్కొన్నారు. వివరణాత్మక సమాచారాన్ని తర్వాత విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6.82 కోట్లుగా ఉంది.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఏకంగా 91 లక్షల మంది పేర్లను తొలగించారు. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పీలేట్ ట్రిబ్యూనళ్లలో సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించినవారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలకు ముందే జాబితాలో చేర్చి ఓటు హక్కు కల్పించాలని నిర్దేశించింది. అప్పీలేట్ ట్రిబ్యూనళ్లలో దాదాపు 34 లక్షల మంది తమ ధ్రువపత్రాలను చూపించి ఓటర్లగా నిరూపించుకున్నారు. వాస్తవానికి వీరందరినీ ఎన్నికల సంఘం తన జాబితాలో చేర్చాలి. అయితే ఆ 34 లక్షల మంది గురించి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఏడు లక్షల మంది చేర్చినా..వారు ఎవరు అనేది పూర్తి వివరాలు బయటకు చెప్పలేదు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న భారీ గందరగోళం రాజకీయ పార్టీలను టెన్షన్ పడుతోంది. ఏకంగా 64 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం, మరో 60 లక్షల మందిని పరిశీలనలో ఉంచడమే దీనికి కారణం. ఎన్నికల సంఘం చేపట్టిన జాబితా సవరణ ప్రక్రియలో లక్షలాది మంది పౌరులు తమ ప్రాథమిక హక్కును కోల్పోయారు. స్పెల్లింగ్ తప్పులు, సాంకేతిక కారణాలతో ఏకంగా 64 లక్షల మందిని ఓటుకు దూరం కావడంతో ఈ సారి ఫలితంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్షలాది ఓట్ల గల్లంతు – గెలుపోటములపై భారీ ప్రభావం ఓటర్ల జాబితా సవరణ రాజకీయ పార్టీల లెక్కలను తారుమారు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా సుమారు 11 శాతం ఓటర్ల పేర్లు తొలగించడం వెనుక సాంకేతిక కారణాలు, స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం రాజకీయ సెగ పుట్టిస్తోంది. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో అత్యధికంగా పేర్లు తొలగింపుకు గురవటం.. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చాలా చోట్ల గత ఎన్నికల్లో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో, ఫలితం ఎటు తిరుగుతుందోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు విడుదలయ్యే అనుబంధ జాబితాల ద్వారా తమ పేరు మళ్లీ చేరుతుందని లక్షలాది మంది ఓటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ మద్దతుదారుల పేర్లు తిరిగి జాబితాలో ఉండేలా ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఓటర్లు జాబితా నుంచి దూరం కావడం ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తమ ఓటు హక్కు కోసం ప్రజలు ట్రిబ్యునళ్ల ముందు బారులు తీరడం, న్యాయపోరాటం చేయాల్సి రావడం ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలోని సవాళ్లను సూచిస్తోంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న పోలింగ్‌లో ఈ ఓట్ల గల్లంతు ఎవరికి లాభిస్తుంది? ఎవరిని దెబ్బతీస్తుంది? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గందరగోళం మధ్య ఓటింగ్ శాతం తగ్గిపోతుందా లేక పౌరులు పట్టుదలతో తమ హక్కును సాధించుకుంటారా అనేది వేచి చూడాలి. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియపై నమ్మకం కోల్పోతే అది ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జాబితాలో పేరు లేకపోవడం కంటే ఒక పౌరుడికి పెద్ద అవమానం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఓటరును ట్రిబ్యునళ్ల చుట్టూ తిప్పించడం మంచిది కాదని పార్టీలంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రచారంలో కేంద్ర బిందువుగా మారిన యువ నేత, కీలక వ్యూహకర్త అభిషేక్ బెనర్జీ సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పదునైన విమర్శలు, ప్రతిపక్షాలపై సూటి ప్రశ్నలు, క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో ఆయన తన ప్రచార శైలికి మరింత పదునుపెట్టారు. ఒకవైపు ప్రతిపక్షాల వ్యూహాలను ఎండగడుతూనే, పార్టీ మూలాలను బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్న అడుగులు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. మమత శిష్యరికంలో రాటుదేలిన అభిషేక్.. ఈసారి ఎన్నికల్లో దీదీకి అన్నివిధాలా అండగా నిలుస్తూ టీఎంసీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ సిలిగురి కారిడార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశ భద్రత దృష్ట్యా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ మొదలైన ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతోంది. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు.
బెంగాల్ ఎన్నికలను కాషాయ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. అమిత్ షా ఏకంగా పదిహేను రోజుల పాటు బెంగాల్లోనే క్యాంప్ వేశారు. మోడీ కూడా ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. చివరకు ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ అనూహ్యంగా ప్రోటోకాల్ పక్కనపెట్టి.. రోడ్డు పక్కన దుకాణంలో ఝాల్ మురీ తినటం.. బెంగాలీలను ఆశ్చర్యపరిచింది. ఓవైపు మమతా పాలనపై విమర్శలు ఎక్కుపెడుతున్న మోడీ.. మరోవైపు బెంగాలీలతో కలిసిపోయే ప్రయత్నం చేస్తూ.. స్థానిక బీజేపీ నేతలకు ప్రజాదరణ లేకపోవటాన్ని కవర్ చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. బెంగాల్లో ముస్లిం ఓటు బ్యాంకే మమతను కాపాడుతోందని గుర్తించిన బీజేపీ.. ఈసారి అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేసింది. ముస్లిమేతరుల్ని వీలైనంత మేర కన్సాలిడేట్ చేసే అవకాశాలు చూస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ముస్లింల జనాభా 27 అయినప్పటికీ.. 3 జిల్లాల్లోనే వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. అవి ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్ పూర్. వీటిలో ముర్షిదాబాద్ లో ముస్లింల జనాభా 66శాతంగా ఉంది. ఇక మాల్డా జిల్లాలో 51శాతం, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో 50శాతంగా ఉంది. మిగతా 20 జిల్లాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ, 251 అసెంబ్లీ సీట్లలో.. స్పష్టంగా హిందువుల మెజారిటీ ఉంది. అంటే, రాష్ట్ర స్థాయిలో ముస్లింల జనాభా 27శాతం ఉన్నప్పటికీ.. భౌగోళికంగా అది కొన్ని బెల్ట్లలోనే కేంద్రీకృతమై ఉంది.
బెంగాల్ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించాయి. ఈసారి బెంగాల్ గెలిస్తే.. తర్వాత ఢిల్లీపై ఫోకస్ పెడతామని దీదీ హెచ్చరించారు. దీంతో మమతను బెంగాల్లోనే నిలువరించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ ఆ పార్టీ పప్పులు బెంగాల్లో ఉడికేది లేదని, తమ నేత భవిష్యత్తులో ప్రధాని అవుతారని టీఎంసీ శ్రేణులు తొడ కొడుతున్నాయి. బెంగాల్లో అధికారం ఖాయమని ధీమాగా ఉన్న టీఎంసీ.. లోలోపల బీజేపీ ఏం చేస్తుందోనని భయపడుతోంది. ఇక ఈసారి పవర్లోకి వచ్చేస్తామని ఊదరగొడుతున్న బీజేపీ కూడా.. లోపాయికారీగా మమత బలాలు చూసి కలవరపడుతోంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులతో పాటు మిగతా పక్షాలు ఎవరి ఓట్లు చీల్చుతాయి.. ఎవరి పుట్టి ముంచుతాయనేవి కీలక ప్రశ్నలుగా మిగిలాయి. బెంగాల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్యే ఉన్నా.. కాంగ్రెస్ ఒంటరి పోరు ఎవరి పుట్టి ముంచుతుందనేది తేలాల్సి ఉంది. అలాగే ఎంఐఎం వ్యూహాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.
మొత్తం మీద బెంగాల్ ఎన్నికలు మమతకు, బీజేపీకి పరువు, ప్రతిష్ఠకు సవాల్‌గా మారాయి. ఈ రెండు పార్టీల వ్యూహప్రతివ్యూహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అందరూ అనుకున్నట్టుగా ఓ పార్టీకి సవాల్‌గా మారిన అంశమే.. మరో పార్టీని కూడా ఎంతోకొంత దెబ్బ కొడుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి, ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు.. అధికార టీఎంసీతో పాటు విపక్ష బీజేపీకీ సవాలుగా మారాయి. ఈ పరిణామాలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయనుందన్న ప్రచారం నెలకొంది. ఈసారి ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీఎంసీ ఈసారి టికెట్ నిరాకరించింది. బీజేపీ, సీపీఎంలలోను అదే పరిస్థితి. కొత్త అభ్యర్థుల పట్ల అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు.. పోలింగ్ బూత్ స్థాయిలో సహకరించకపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1977 నుంచి ఏకధాటిగా పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ అనూహ్యంగా ఓడించారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని కూడా వెస్ట్ బెంగాల్లో పూర్తిగా నాశనం చేసింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలవకుండా మమతా బెనర్జీ అడ్డుకోగలిగారు. ఆమెకు ఎదురు నిలిచిన రాజకీయ శత్రువులు మొత్తం కనుమరుగై పోయారని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ హఠాత్ పరిణామానికి మొదట్లో కాస్త తడబడ్డ మమత.. తర్వాత బాగానే తేరుకున్నారు. తన పోరాటపటిమను కొత్త శత్రువుకి కూడా గట్టిగానే చూపించారు. కాకపోతే మునుపటి ఎన్నికల కంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చెమటోడ్చాల్సి వచ్చిన మాటను టీఎంసీ కూడా కాదనలేదు. కానీ ఏ మాటకు ఆ మాటే. మమతా బెనర్జీ బెంగాల్ రాజకీయంలో తల పండిపోయారు. ఆమెను ఓడించడం అంత తేలిక కాదని బీజేపీకీ తెలుసు. మమతా బెనర్జీకి రాజకీయాల్లో ఫైటర్ గా గుర్తింపు ఉంది. ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పట్నుంచీ.. సీఎం అయ్యాక కూడా ఎప్పుడూ పోరాట పంథాను వీడలేదు. యూత్ కాంగ్రెస్ నేతగా ఎలా ఉన్నారో.. బెంగాల్ సీఎంగా కూడా అలాగే ఉండటం మమత ప్రత్యేకత. ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉన్నాననే ఫీలింగ్ కలిగించడంలో దీదీ విజయవంతమౌతున్నారు. అయితే మమత పాలనపై చాలా విమర్శలు కూడా ఉన్నాయి.
మమత అతి దూకుడే.. ఆమెకు ఒక్కోసారి కష్టాలు తెచ్చిపెడుతుంది. స్థానికంగా ఉన్న ప్రత్యర్థుల్ని అణగదొక్కడం ఎప్పటికైనా ముప్పేనని మమత గ్రహించలేకపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లు గెలిచినప్పుడు కూడా.. దీదీ కాషాయ పార్టీని సీరియస్ గా తీసుకోలేదు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు నడిపినవాళ్లకే దిక్కు లేదు.. బీజేపీ ఏం చేస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మమతకు తలబొప్పి కొట్టింది. స్థానిక ప్రత్యర్థుల్ని బలహీనపరిచిన కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ భర్తీ చేసిందని ఆలస్యంగా అర్థమైంది. తృణమూల్ ఆగడాలతో బెదిరిపోయిన లెఫ్ట్ కార్యకర్తలు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. టీఎంసీ కార్యకర్తల దాడికి కనీస ప్రతిఘటన ఇవ్వాలన్నా.. కాషాయ జెండా నీడ తప్పదని గ్రహించారు. దీంతో బీజేపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం బాగా పెరిగింది. ఆ బలంతోనే 2021 ఎన్నికల్లో మమతకు ముచ్చెమటలు పట్టేలా చేసింది కాషాయ పార్టీ. ఇప్పుడు ఏకంగా గెలిచేస్తామని సవాల్ విసురుతోంది.
అధికారం కోసం తృణమూల్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న తరుణంలో.. బెంగాల్ లో కీలకమైన మైనార్టీలు ఎటువైపు మొగ్గుచూపుతారు, వీరి ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక రోహిగ్యాలది వేరే కథ. కేవలం తమ పార్టీ ఓటుబ్యాంకు కోసమే మమత వీరి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తుందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఇటీవలే జరిగిన సర్‌లో ఏకంగా 58 లక్షల ఓట్లు తొలగించారు. వీటిలో మెజార్టీ టీఎంసీ ఓట్లేనని బీజేపీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. వీరంతా చొరబాటుదారులని, ఓటు బ్యాంక్ కోసం దీదీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడుతున్నారు. తద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాంటీ బంగ్లాదేశ్ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2011 నుంచి మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో 29 మంది ఎంపీలని మమతా బెనర్జీ గెలిపించారు. ఈ ట్రెండ్ ప్రకారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవాలి. మమతకు ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఆమెకు ఓటు వేసే 28 శాతం మంది ముస్లిం ఓటర్లు. మరోవైపు బీజేపీ కూడా వేగంగా పుంజుకుంటోంది. కానీ మమతా బెనర్జీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీ ఎంతవరకు క్యాష్ చేసుకోగలదనేది కీలకం. బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. దేశ రాజకీయాలపై ప్రభావం చూపటం ఖాయం అని చెప్పటంలో మరో మాటకు తావు లేదు.
తాజావార్తలు
-
Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
-
Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్ లేని టాలీవుడ్
-
V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
-
Hansika : హన్సిక పై మండిపడుతున్న నెటిజన్ల..
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!
ట్రెండింగ్
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!