Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే నాటికే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడమే కాకుండా.. అసలు యుద్ధాలే లేని ప్రపంచాన్ని సాకారం చేస్తానంటూ గప్పాలు కొట్టారు ట్రంప్. కానీ గద్దెనెక్కిన ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చి పెట్టారు. పోనీ యుద్ధమైనా సరిగా చేస్తున్నారా అంటే.. కనీస ప్రాథమిక అంచనాలు కూడా సరిపోలలేదు. దీంతో యుద్ధ క్షేత్రంలో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది. ఇప్పుడు యుద్ధభూమి వదిలి వచ్చేద్దామనుకున్నా.. వీలుకావడం లేదని ట్రంప్ సలహాదారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఇది నిజానికి ట్రంప్ తల తీసినంత దుస్థితి. కానీ ఆయన మాత్రం షరా మామూలుగా డాంబికం ప్రదర్శిస్తున్నారు. కిందపడ్డా తనదే పైచేయి అన్నట్టుగా.. ఇరాన్ యుద్ధంలో అమెరికానే గెలిచామని ప్రకటిస్తున్నారు. ట్రంప్ ప్రకటనలు చూసి.. ప్రపంచ దేశాల ప్రజలంతా అమెరికాను అపహాస్యం చేస్తున్నారు.
ఇక ఇరాన్ యుద్ధంలో ట్రంప్ లీలలు అన్నీ ఇన్నీ కాదు. కొద్దిరోజుల క్రితం ఇరాన్ నాగరికతను ఒక్కరాత్రిలో నాశనం చేస్తామని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్.. కొద్ది గంటల వ్యవధిలోనే తోక ముడిచారు. అదేమంటే ఇరాన్ దారికొచ్చేసిందని కాకమ్మ కథలు చెప్పారు. తీరా ఇరాన్ ప్రకటన చూస్తే.. ట్రంప్దంతా డ్రామానేనని తేలిపోయింది. ఆ డ్రామాను ప్రపంచం మర్చిపోకముందే.. ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపిన ట్రంప్.. మళ్లీ పాత క్యాసెట్టే వేశారు. ఈ రాత్రికి ఇరాన్‌ను దారుణంగా దెబ్బతీస్తామని చెప్పి.. తెల్లారేసరికి యుద్ధం ఆపేశారు. మళ్లీ డీల్ కుదిరిందని పాత అబద్ధమే చెప్పారు. కానీ ఈసారీ ట్రంప్ తొండాటే ఆడారని ఇరాన్ తేల్చేసింది. అసలు యుద్ధం చేస్తున్నామనే సీరియస్‌నెస్ లేకుండా.. ట్రంప్ పేలుస్తున్న కుళ్లు జోకులు చూసి.. ప్రపంచానికి మతిపోతోంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. ఎవరో వచ్చి ఏదో అంటించుకున్నట్టుగా ఉంది ట్రంప్ తీరు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
ఓవైపు యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం గురించి సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతోంది. అంతకుముందే అసలు నష్టం అంచనాల్ని పెంటగన్ తొక్కిపట్టింది. ఈ సంగతి తెలుసుకోవాలనే కనీస బాధ్యత లేని ట్రంప్.. ఇక్కడ ఇరాన్ యుద్ధం ముగించకుండానే.. క్యూబాను ఆక్రమిస్తాం అంటూ వెర్రికేకలు పెట్టడం చూసి.. ట్రంప్‌ను ఏమనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతవరకూ హర్మూజ్‌ను తెరిపించలేక.. తిప్పలు పడుతున్న ట్రంప్.. తగుదునమ్మా అని సంబంధం లేని నావికుల్ని మాత్రం బలితీసుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ వైఖరిపై మండిపడుతున్నాయి. చివరకు హర్మూజ్ దగ్గర ఇరాన్ సైన్యం కంటే.. యూఎస్ సృష్టిస్తున్న విధ్వంసమే ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. ఇరాన్ యుద్ధం పేరుతో ట్రంప్ చేస్తున్న పాతకాల్ని లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదని యుద్ధ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
ఎంత శక్తివంతమైన దేశం అయినా యుద్ధం చేసేటప్పుడు ముందూ వెనుకా చూసుకుంటుంది. కానీ ట్రంప్ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని మరీ యుద్ధ రంగంలోకి దిగారు. నెతన్యాహు దారి చెబుతుంటే.. ముందుకెళ్లొచ్చనుకున్నారు. మధ్యలో నెతన్యాహు తప్పుకున్నా కూడా.. ట్రంప్ మాత్రం గంతలు కట్టుకునే యుద్ధం చేశారు. అలా గుడ్డి వ్యూహం పన్నిన ఫలితంగానే ఇరాన్ యుద్ధాన్ని తన నియంత్రణలోకి తీసుకుని.. అమెరికాను అదలించింది. అయినా సరే కళ్లు తెరవాలనే స్పృహ లేని ట్రంప్.. ఇప్పుడు ప్రపంచం కళ్లకు కూడా గంతలు కట్టాలని చూడటమే అసలైన చోద్యం. అమెరికా అధ్యక్షుడి ప్రతి క్షణం చాలా విలువైనది. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీస్ లో మరో దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారంటే.. ఏదో కొంపలు మునిగే వ్యవహారంపై చర్చిస్తున్నారని అర్థం. కానీ అలాంటి ఓవల్ ఆఫీస్ ను కూడా ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ పై ఆందోళన ఉన్న తరుణంలో.. ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంపే పని కట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం.. అదీ యుద్ధానికి సంబంధించి కూడా అబద్ధాలు, అర్ధసత్యాలకే ప్రాధాన్యత ఇవ్వడం.. ట్రంప్ పైత్య ప్రకోపానికి అద్దం పడుతోంది.
ట్రంప్ తీరు చూసిన ప్రపంచం జుట్టు పీక్కుంటోంది. ఇక వైట్ హౌస్ అధికారులకైతే మతిపోతోంది. ఇలాగైతే తమ ప్రెసిడెంట్ ఏం మాట్లాడినా ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవచ్చని వారు మథనపడుతున్నారు. రేపొద్దున ట్రంప్ నిజం చెప్పినా కూడా.. ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని వాపోతున్నారు. కానీ ట్రంప్ కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడటం.. మనసుకు తోచిన పని చేయటానికి అలవాటుపడ్డారు. సమయం, సందర్భం కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కావడం లేదు. ఏకంగా వ్యాపారాల్లో వేలు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తల్ని నేరుగా బెదిరిస్తున్నారు. గ్లోబలైజేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అమెరికా అయితే.. అదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. లోకల్ నినాదం ఎత్తుకున్నారు. ఏ వస్తువైనా అమెరికాలో తయారవ్వాల్సిందే. లేకపోతే భారీగా పన్నులేస్తామని అల్టిమేటం ఇస్తున్నారు. ఏ వ్యాపారం అయినా అగ్రరాజ్యంలోనే చేయాలని కండిషన్లు పెడుతున్నారు.
అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికాలో అరాచకం సృష్టిస్తున్నారు. అమెరికా మౌలిక విలువలపై దాడి చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు కష్టపడి నిర్మించిన అమెరికాను.. చేజేతులా నేలమట్టం చేసేలా ఉన్నారు. తా వలచింది రంభ అన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు. దశాబ్దాలుగా అమెరికా వినిపించిన వాదనలకు.. విరుద్ధమైన స్టాండ్ తీసుకుంటున్నారు. అదేమంటే గత అధ్యక్షులకు బుర్ర లేదు.. నేనే మేధావినని దబాయిస్తున్నారు. యుద్ధం, ఒప్పందం, రాజకీయం.. ఏదైనా బిజినెస్సే అంటున్నారు ట్రంప్. ఈ తీరుతో ఇతర దేశాలన్నీ బెంబేలెత్తుతున్నాయి. ట్రంప్ తో చర్చలు ఓ ఎత్తైతే.. ఆ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది మరో ఎత్తుగా మారింది. అసలు అజెండాలో లేని అంశాలు లేవనెత్తటం, అనూహ్యంగా వింతగా ప్రవర్తించటం, మిగతా దేశాధ్యక్షుల్ని చిన్నబుచ్చుతున్నారు. ట్రంప్ తీరు ఇలాగే ఉంటే.. అమెరికాతో ఎలాంటి చర్చలకైనా.. ఎవరూ ముందుకు రాకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. చర్చలంటే ఎవరి వాదన వారు వినిపిస్తారు. అంతిమంగా డీల్ కుదరొచ్చు.. లేకపోవచ్చు. కానీ గౌరవానికి భంగం కలగకూడదనే షరతు కచ్చితంగా ఉంటుంది. కానీ ట్రంప్ తో మీటింగ్ అంటే మాత్రం .. మొదట గౌరవం వదిలేయాలనే సంకేతం వెళ్లిపోతోంది. మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. నిన్న సౌతాఫ్రికా అధ్యక్షుడికీ ట్రంప్ దగ్గర చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
అంతర్జాతీయ వాణిజ్యాన్ని ట్రంప్ అస్తవ్యస్తం చేశారు. ప్రతీకార సుంకాల పేరుతో టారిఫ్ వార్ కు తెరలేపారు. దీంతో అన్ని దేశాల్లో కలకలం రేగింది. కొన్ని దేశాలు అమెరికాకు దూరం కాగా.. మరికొన్ని చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. ట్రంప్ అధికారంలో ఉన్నంతవరకూ ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. పెట్టుబడిదారీ దేశంగా పేరున్న అమెరికా తీరుతో.. పెట్టుబడులే ప్రమాదంలో పడటం.. అధ్యక్షుడిగా ట్రంప్ వెలగబెట్టిన వైపరీత్యం అంటే అతిశయోక్తి కానే కాదు. సుంకాల విషయంలో అభ్యంతరాలుంటే భాగస్వాములతో చర్చించాలి. అంతే కానీ ఉన్నఫళంగా, ఏకపక్షంగా ట్రంప్ సుంకాలు ప్రకటించడం.. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ట్రంప్ ను కరోనాకు మించిన విపత్తుగా ఆర్థికవేత్తలు అభివర్ణించారంటే.. ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పేరుకి ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన సమస్యకు కారణమైనట్టు పైకి కనిపిస్తున్నా.. అసలు కారణం మాత్రం ట్రంపే అని చెప్పటానికి ఎవ్వరూ సందేహించాల్సిన పని లేదు. మొన్నటిదాకా ఇరాన్ మొండికేస్తోందంటూ కథలు చెప్పిన ట్రంప్.. ఇప్పుడు ఆయనే కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహరిస్తున్నారు. ఓవైపు ప్రపంచ ఆర్థికవ్యవస్థ విధ్వంసమౌతున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయిస్తున్నారు. అసలు సొంత దేశం ఆర్థికవ్యవస్థ గురించే పట్టని ట్రంప్‌కు మిగతా ప్రపంచం గురించి ఏం యోచన ఉంటుందనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఎందుకంటే ఎన్నో ఆశలతో ట్రంప్‌ను ఎన్నుకున్న అమెరికన్ల నోట్లో ట్రంప్ మొదటే మట్టికొట్టారు. ఇప్పుడు డాలర్ విలువను కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేస్తున్నా.. అమెరికా ఆర్థికవ్యవస్థ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఎన్ని పిచ్చిపనులు చేసినా అమెరికా ఆర్థికవ్యవస్థ పుంజుకోకపోవడంతో.. వెర్రెక్కిన ట్రంప్.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రపంచం పుట్టి ముంచాలనే దురాలోచన చేస్తున్నారని కొందరు ఆర్థికవేత్తలు సూత్రీకరిస్తున్నారు.
ట్రంప్ ను చూశాక ఓ దేశాధ్యక్షుడు ఎలా ఉండకూడదో ప్రపంచం పాఠం నేర్చుకుంటుందనడంలో సందేహం లేదు. ట్రంప్ లాంటి వ్యక్తులకు రెండో ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో అమెరికాకూ తెలిసొస్తుంది. ఇంత జరుగుతున్నా.. ట్రంప్ మాత్రం ఎక్కడా వెనక్కితగ్గటం లేదు. పైగా మరింతగా విజృంభిస్తానని బహిరంగంగానే చెబుతున్నారు. తనకు అద్భుతమైన ఆలోచనలున్నాయని, అవన్నీ అమలయ్యాక.. అమెరికా స్వర్గంగా మారుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కానీ ట్రంప్ మాటల్ని అమెరికన్లు మాత్రం నమ్మడం లేదు. తమకే స్వర్గమూ వద్దు.. ఉన్న దేశాన్ని ఉన్నట్టుగా ఉంచాలని కోరుకుంటున్నారు. అదే విషయాన్ని వైట్ హౌస్ దగ్గర కూడా నిరసల ప్రదర్శనలు చేసి మరీ చెప్పారు. కానీ ట్రంప్ చెవులకు ఏమీ వినిపించడం లేదు. ఆయన కళ్లకు నెగటివిటీ కనిపించడం లేదు. తానో అద్భుత మేధావి.. ఈ పిచ్చి ప్రపంచం గుర్తించడం లేదనేదే ట్రంప్ బాధ. ఇలంటి వ్యక్తితో ఎలా వేగాలా అని మిగతా దేశాలతో పాటు అమెరికన్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
ఎవరేమనుకున్నా నేనింతే అంటున్నారు ట్రంప్. పైగా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లని మొండిగా వ్యవహరిస్తున్నారు. నా మాటే ఫైనల్.. ఇష్టం ఉన్నా లేకున్నా.. చచ్చినట్టు ఒప్పుకోవాలని అల్టిమేటమ్ ఇస్తున్నారు. అమెరికాకి ఆగర్భ శత్రువైన రష్యాకు దగ్గరౌతున్న ట్రంప్.. చిరకాల మిత్రదేశాలుగా ఉన్న యూరప్ దేశాలతో సంబంధాలు కట్ చేసుకోవడం అమెరికన్లకు టెర్రర్ పుట్టిస్తోంది. ఈ ట్రంప్ చివరకు అందర్నీ నట్టేట ముంచుతాడనే భయం మొదలైంది. అమెరికా ఏర్పాటుచేసిన నాటోతో.. ట్రంప్ అంటీముట్టనట్టుగా వ్యవహరించటం.. దేశ భద్రతకే ముప్పు తేవచ్చనా వాదన ఉంది. ట్రంప్ యుద్ధాలను బిజినెస్ డీల్స్ కు సాధనాలుగా చూడటం కూడా నిప్పుతో చెలగాటం అనే అభిప్రాయాలున్నాయి.
అసలు పాలనలో ఒక్క కోణంలో అయినా నిర్మాణాత్మకంగా పనిచేయని ట్రంప్.. విధ్వంస పాలనకు తెరతీయటం అన్ని దేశాలతో పాటు అమెరికన్లకు కూడా చీకాకు పుట్టించింది. ట్రంప్ గతంలో మాదిరిగా అనుభవం లేని వ్యక్తి కాదు. ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఇప్పుడు కచ్చితంగా పాలనలో మార్పు ఉంటుందని అమెరికన్లు ఆశించారు. కానీ ట్రంప్ మాత్రం ఏమీ మారలేదని రుజువు చేసుకున్నారు. ప్రతి నిర్ణయం హడావుడిగా తీసుకోవటం.. సమగ్ర చర్చ లేకుండా ముందుకెళ్లటం.. నిపుణుల సూచనలు బేఖాతరు చేయటం.. చివరకు ఎదురుదెబ్బలు తగిలాక నాలుక్కరుచుకోవటం ట్రంప్ కు పరిపాటిగా మారింది. ట్రంప్ తీరు చూస్తుంటే.. త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పుకూల్చేలా ఉన్నారనే ఆందోళన వ్యక్తమౌతోంది.
అలా ఇటు అధ్యక్షుడిగా సొంత దేశానికి.. అటు పెద్దన్నగా ప్రపంచానికీ రెంటికీ చెడ్డ రేవడిగా మారిన ట్రంప్.. ఇప్పుడు అందరికీ తలకు మించిన భారంగా తయారయ్యారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కుంటున్న ప్రతి సమస్యకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ట్రంపే కారణం అనే భావన అందరిలో పెరుగుతోంది. అమెరికాలో ఓ వర్గంతో పాటు ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా.. ట్రంప్ నూకలు ఎప్పుడు చెల్లుతాయా అనే ఆలోచనలో ఉండటం వింతేం కాదు. ఎందుకంటే ట్రంప్ ఆ స్థాయిలో అందర్నీ వెంటాడి వేధిస్తున్నారు. ట్రంప్ తీరు చూస్తుంటే.. ఎప్పటికీ కల్లోలిత ప్రపంచాన్నే కానుకగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి పదవిలో ఉన్న ట్రంప్ ఉచితానుచితాలు మరిచి తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇప్పటికే అన్ని దేశాల్నీ కుదిపేస్తున్నాయి. ట్రంప్ కు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. ట్రంప్ ఇప్పటికే మరిన్ని ప్రమాదకర హింట్లు కూడా ఇచ్చారు. మరికొన్ని ఆలోచనల్ని బిల్లుల రూపంలో అమెరికా కాంగ్రెస్ ముందు పెట్టారు. ఇక ఇవి కూడా ఆచరణలోకి వస్తే.. అంతే అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పుడు ట్రంప్ ను ఆపేవారెవరూ కనిపించడం లేదు. ట్రంప్ కూడా బ్రేకుల్లేని బుల్డోజర్ లా తయారయ్యారు. కాంగ్రెస్ కు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ కు ఎదురుదెబ్బ తప్పదని, ఆ తర్వాతే ఆయన స్పృహలోకి వస్తారనే అంచనాలున్నా.. అవి ఎంతవరకు నిజమౌతాయనేది చూడాల్సి ఉంది.
ఇక అమెరికా విద్యావ్యవస్థపై అయితే ట్రంప్ కత్తిగట్టారనే చెప్పాలి. అమెరికాను శతాబ్దాలుగా పైమెట్టుమీద నిలబెడుతోంది అక్కడి విద్యావ్యవస్థే. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య ఉంటుందనే ఉద్దేశంతో.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి విద్యార్థులు అమెరికా వచ్చి చదువుకుంటున్నారు. అలా వచ్చిన విద్యార్థుల్లో క్రీమ్ ను వాడుకునే అమెరికా తన అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుందనేది బహిరంగ రహస్యం. అందుకే అక్కడ విద్యావ్యవస్థకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అక్కడి వర్సిటీలకు కొన్ని ప్రత్యేక అధికారాలున్నాయి. కానీ అవన్నీ గతమే అంటున్నారు ట్రంప్. ఏవో కొన్ని వర్సిటీల్లో కొందరు విద్యార్థులు గతంలో పాలస్తీనా అనుకూల ఆందోళనల చేశారని వారిని దేశం నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగలేదు. ఆ సాకుతో.. అన్ని వర్సిటీలూ తమ విద్యార్థుల ప్రవర్తన రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. అమెరికా సర్కారు నుంచి నిధులు రావాలంటే.. కొన్ని షరతులకు అంగీకరించాలని హుకుం జారీ చేశారు. అయితే ఈ పోకడను అమెరికా వర్సిటీలు తప్పుబట్టాయి. కొన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేశాయి. సాధారణంగా అయితే అంతటితో వెనక్కితగ్గి.. వివాదాన్ని ముగిస్తారు. కానీ అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి.. తెగేదాకా లాగుతున్నారు. ఏకంగా ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీపై కత్తి కట్టారు. అక్కడ విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లకు వీల్లేకుండా చేశారు. ఇప్పటికే ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇతర వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని, లేకపోతే అమెరికాలో ఉండే చట్టబద్ధమైన హక్కు కోల్పోతారని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో హార్వర్డ్ లో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఇది కక్ష సాధింపు చర్యే అని హార్వర్డ్ కూడా స్పందించింది. అయితే 72 గంటల్లో ఆరు షరతులు పాటిస్తే.. తన ఆదేశాలు వెనక్కితీసుకుంటానన్న ట్రంప్ ప్రకటన కూడా అభ్యంతరకరమే అంటోంది హార్వర్డ్.
అమెరికా అంటేనే వలసల దేశం. వలసదారుల అవసరాన్ని గుర్తించిన అమెరికా రాజ్యాంగ నిర్మాతలు మరే దేశంలో లేని విధంగా వలసదారుల్ని రెండు చేతులా ఆహ్వానించారు. వారిపై వివక్ష చూపడం, అవమానించడం ఎప్పటికీ చేయకూడదని నిర్దేశించారు. ఆ తర్వాత కూడా వలసదారులకు ఆంక్షలు పెట్టాలనే చర్చ వచ్చినా.. అమెరికా కాంగ్రెస్ ఆ ప్రతిపాదన తిరస్కరించింది. ఇలా వలసదారుల్ని అక్కున చేర్చుకున్న చరిత్ర ఉన్న అమెరికాకు.. ట్రంప్ లాంటి అధ్యక్షుడు వస్తారని ఎవరూ అనుకుని ఉండరు. సంక్షోభాలు, యుద్ధాలు, అశాంతి, కష్టాలున్న ఏ దేశం నుంచైనా ఎవరైనా వచ్చి అమెరికాలో స్థిరపడొచ్చు. అలాగే శాంతియుతంగా ఉన్న దేశాల నుంచి కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఎవరైనా అమెరికా రావచ్చు. అక్కడే సెటిల్ కావచ్చు. అక్కడ వారిపై ఎలాంటి వివక్షా ఉండదు. మొన్నటివరకూ అమెరికా అలాగే ఉంది. అందుకే అవకాశాల స్వర్గం అనే పేరు తెచ్చుకుంది. కానీ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టాక సీన్ మారింది. మొదటి అడుగే వలసదారులకు వ్యతిరేకంగా వేసిన ట్రంప్.. అక్రమ వలసదారులే టార్గెట్ అని చెప్పి.. వలసదారులందరిలోనూ గుబులు పుట్టించారు. ఎక్కడి వారక్కడే గప్ చుప్ అన్నట్టుగా అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారిని.. మిగతా దేశాల నుంచి యూఎస్ రావాలనుకున్నవారిని తనిఖీల పేరుతో విసిగిస్తూ.. ఎక్కిడవారక్కడే ఆగిపోయేలా చేశారు. చివరకు అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్న వారు కూడా విదేశీ ప్రయాణాలకు వెనుకాడుతున్నారంటే.. ట్రంప్ అరాచకం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వలసదారుల్ని వేటాడి మరీ వేధిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. చాలా చోట్ల అమానవీయంగా వ్యవహరించింది. దీంతో పెద్ద సంఖ్యలో కోర్టు కేసులు దాఖలయ్యాయి. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేశాక కానీ ట్రంప్ కాస్త తగ్గలేదు.
అమెరికాకు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేసే దేశంగా పేరుంది. అలాగే అమెరికా చెబితే.. చాలా దేశాలు వినే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని వివాదాల జోలికి పోకుండా అమెరికా నియంత్రించుకున్న దాఖలాలున్నాయి. ఇవన్నీ అమెరికా ట్రాక్ రికార్డులు. కానీ ట్రంప్ వచ్చీరాగానే వీటన్నింటికీ తిలోదకాలిచ్చేశారు. అసలు అమెరికా అధ్యక్షుడిగా సొంత దేశం బాగు కోసమైనా ట్రంప్ ఒక్కరోజైనా ఆలోచించారా.. అంటే లేదనే చెప్పాలి. అమెరికాలో చాలా సమస్యలున్నాయి. వాటికి పరిష్కారాలు వెతకటం మానేసి.. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చటం అవివేకమే. అమెరికా పౌరుల జీవనప్రమాణాలు పెంచుతానని ట్రంప్ చేసిన వాగ్దానం కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. ట్రంప్ వచ్చాక ద్రవ్యోల్బణం పెరగడంతో.. అమెరికన్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది. చివరకు ట్రంప్ పాలన చూసి.. విరక్తి చెందిన జనం అమెరికా వ్యాప్తంగా 50కి పైగా రాష్ట్రాల్లో రెండు విడతలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్‌సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!