అక్కడ ఎర్రకోట నుండి ఇక్కడ రాష్ట్రాల వరకు ఇదే పరిస్థితి.. ప్రధానుల నుండి సీఎంల వరకు అవే విమర్శలు. ఎవరూ తక్కువ తినలేదు. ఇండిపెండెన్స్ డే పాలిటిక్స్ లో ఎవరికి వారే దూసుకుపోయారు. త్యాగధనులను స్మరించుకోవటాన్ని పక్కన పెట్టి, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించటానికే ప్రాధాన్యమిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవమంటే మనకో లెక్కుంటుంది..
ఉదయాన్నే లేచి తయారై…. జెండా ఎగరేసి, జాతీయ గీతం పాడుకుని నోరు తీపిచేసుకుంటాం.. ఎందరో వీరుల త్యాగఫలాన్ని తలుచుకుంటాం.. పరాయి పాలన నుండి విముక్తమైన అద్భుత క్షణాలను గుర్తు చేసుకుంటాం.. ఢిల్లీలో ఎర్రకోట నుండి….ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రభుత్వాఫీసు వరకు వేడుకలు సాధారణంగా ఇలాగే జరుగుతాయి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. సందర్భమేదైనా, వేదిక ఏదైనా అవే ప్రసంగాలు, అవే విమర్శలు వినిపిస్తున్నాయి. రొడ్డకొట్టుడు ఎన్నికల ప్రసంగాల తీరులోనే ఇండిపెండెన్స్ డే స్పీచ్ లు కూడా నడిచాయి..
ఢిల్లీలో ప్రధాని స్పీచ్ గతానికి భిన్నంగా నడిచింది. ఓ పక్క జాతికి సందేశం ఇస్తూనే..మరోపక్క విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ సాగింది. ఈ ఒక్కరోజన్నా కాంగ్రెస్‌ని ప్రాంతీయ పార్టీలను పక్కనపెట్టి, ఇతర విషయాలతో ప్రధాని ప్రసంగం ఉంటే బాగుండేదని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. అవినీతితో పోరాడాలన్నారు ప్రధాని మోడీ. దేశాన్ని దోచుకున్న వారి లెక్కలు బయటకు తీస్తున్నామని చెప్పారు. అక్రమ సంపాదనను జప్తు చేస్తున్నామని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ప్రజల మద్దతు కావాలని కోరారు.
వారసత్వ రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్నారు ప్రధాని మోడీ. అవినీతి, వారసత్వం దేశం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సవాళ్లని అన్నారు. వారసత్వం వల్ల… ప్రతిభ మరుగునపడుతోందన్నారు. రాజకీయాల్లోనూ కుటుంబపాలనను అంతమొందించాలన్నారు మోడీ.
ప్రధాని పరోక్ష విమర్శలపై విపక్షాలు కూడా స్పందించాయి. ప్రధాని విమర్శల కౌంటర్లకు ప్రతిపక్షాలకు కూడా జెండా పండుగే వేదికగా మారింది. దేశ ప్రజలకు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రచారం కోసం బిజెపి నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్‌లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ హర్ ఘర్ తిరంగాలో నెహ్రును తొలగించడంపై మండిపడ్డారు. దేశంలో గత సాధించిన విజయాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.
నిజానికిదో అరుదైన సందర్భం. వజ్రోత్సవాల వరుణం.. స్వాతంత్ర్య అమృత మహొత్సవాలను జరుపుకుంటున్నాం.. 75ఏళ్ల భారత దేశం సాధించిన విజయాలను, సాధించాల్సిన లక్ష్యాలను మాట్లాడుకోవలసిన సమయం ఇది. కానీ, వేదికలన్నీ పొలిటికల్ విమర్శలకే కేంద్రంగా మారాయి. అటు ఎర్రకోటలో ప్రధాని నుండి.. తెలుగు రాష్ట్రాల్లో సీఎంల వరకు అందరిలో ఇదే ధోరణి కనిపించింది.
పంద్రాగస్టు వేడుకల వేదికగా మరోసారి కేంద్రం పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. విద్వేష రాజకీయాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల్ని ఉచితాలనడం అవమానించడమేనన్నారు సీఎం కేసీఆర్. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు, విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు ఢిల్లీ సీఎం కూడా ఆగస్ట్15 వేడుకలను విమర్శలకు కేంద్రంగా మార్చారు. ఉచితాలపై ప్రధాని ఈ మధ్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సంక్షేమ పథకాలను ఉచితాలని పిలవటాన్ని విమర్శించారు.
అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇండిపెండెన్స్ డే వేడుకలను విమర్శలకు వాడేసుకున్నారు. కేంద్రం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల్లోని ఎన్డీఏతర ప్రభుత్వాలను విచ్చిన్నం చేయటానిక బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మొత్తానికి సామరస్యంగా, ఏకీభావంతో జరగాల్సిన జెండా పండుగ కాస్తా, దేశమంతా హాట్ హాట్ గా నడిచింది. ఎవరికి వారు రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలకు ఆగస్టు15 వేడుకలను ఉపయోగించుకున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ, దానికి చాలా వేదికలుంటాయి. దేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా రాజకీయాలను పక్కనపెట్టి వ్యవహరించటం సమంజసం. కానీ, ఈ స్పృహ ఏ ఒక్కరిలో కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏడాది పొడవునా చేసేది ఇదే కదా..ఈ ఒక్కరోజైనా కాస్త ప్రశాంతంగా ఉండాలి కదా..దేనికైనా ఓ సమయం సందర్భం ఉంటుంది.వేదికను బట్టే మాటలుండాలి..వేడుకనుబట్టే వ్యవహారం ఉండాలి..
స్వతంత్ర భారతావని 75ఏళ్ల వేడుకల సమయంలో కూడా రాజకీయ నాయకుల రచ్చేనా?
సాధారణంగా ఇండిపెండెన్స్ డే ప్రసంగాలంటే పాకిస్తాన్ పైనో, చైనా మీదనో విమర్శలుంటాయి. ప్రపంచ దేశాలకు, మనదేశ అత్యున్నత వేదికలమీద నుండి భవిష్యత్ ప్రణాళికలపై సూచనలు, సంకేతాలు ఇస్తుంటారు. దేశం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం గురించి చెప్తారు. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా అధికార విపక్షాలన్నీ వ్యవహరిస్తాయి. కానీ ఈ సారి అందుకు భిన్నంగా కనిపించింది..
ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా, ఆగస్ట్ 15, జనవరి 26 లాంటి సందర్భాల్లో అందరూ ఒకే మాట మీద ఉండటాన్ని దేశం చూసింది.. ప్రత్యేకించి ఈ వజ్రోత్సవాల సమయంలో పార్టీలు, నేతల మధ్య ఇంకెంత సుహృద్భావ వాతావరణం ఉండాలి. కానీ, ఇప్పుడేమాత్రం సామరస్యం లేకుండా పోయింది.
రాజకీయ విమర్శలకు తిట్టుకోవటానికి 365 రోజులుంటాయి. ఆ మాటకొస్తే నిత్యం చేస్తున్నది కూడా అదే. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు, ఎత్తులు, పైఎత్తులతో బతికేస్తుంటారు. కానీ, ఈ ఒక్క రోజన్నా ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ, ఏ వేదికను ప్రత్యర్థులపై దాడికి వదులకోని తీరు నేతల్లో కనిపిస్తోంది. ఎంత కీలకమైన సందర్భం అయినా, ప్రత్యర్థులపై విమర్శలు చేయటం తప్ప, మరో ధోరణి కనిపించటం లేదు.
వారసత్వ రాజకీయాలపై, కుటుంబ పాలన పై ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మోదీ పరోక్ష విమర్శలు చేయటంతో, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రధాని విమర్శలకు కౌంటర్లిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోదీ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలు చేస్తున్న నాయకులు లేరా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబం మీద ఈ రోజు ఏం మాట్లాడినా తప్పేనని, ప్రధాని మోదీ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.మోదీ ప్రధాని కుర్చీ స్థాయిని తగ్గిస్తున్నారని, చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.
మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఇండిపెండెన్స్ డే అనే ఆలోచన లేకుండా, రెండు పార్టీలు ఘర్షణ పడ్డాయి. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో సంజయ్ పాదయాత్రలో బిజెపి, టియ్యారెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాలని బండిసంజయ్ ప్రశ్నించటంతో, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు.. ముందు మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని నిలదీశారు. టియ్యారెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడటంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఓ పక్క రెపరెపలాడే జెండా, మరోపక్క రాజకీయ పార్టీల కొట్లాటలు అన్నట్టుగా ఆ ప్రాంతం మారింది. ఈ ఘటన తర్వాత పోలీసులు దాడి జరుగుతున్నా, పట్టించుకోలేదంటూ బండి సంజయ్ డిజిపికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు ఏపీలో కూడా ఆగస్టు పదిహేను వేడుకల్లో రాజకీయాలు కనిపించాయి. జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కల్యాణ్ రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, యువతకు ఉపాధి కోసం ప్రశ్నిస్తే.. తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. అదే సమయంలో సంక్షేమ పథకాలపై విమర్శలు గుప్పించారు. వాటితోనే వ్యవస్థను నడిపితే ప్రయోజనం ఉండదన్నారు.
75ఏళ్ల తర్వాత రాజకీయాలు ఏ స్థాయికి వచ్చాయో ఇండిపెండెన్స్ డే వేడుకలు చెప్తున్నాయి. ఆఖరికి గవర్నర్ ఎట్ హోమ్ కి సీఎంలు హాజరవుతారో లేదో తెలియని సస్పెన్స్ ఏర్పడింది. ఆ సమావేశంలో అధికార, విపక్ష నాయకులు కలవటం కూడా ఓ పెద్ద విషయంగా మారింది. నాయకులు కేవలం రాజకీయ ప్రత్యర్థుల్లా కాకుండా, బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు. ఏ సందర్భం వచ్చినా విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాట్లాడుతున్న వేదికేంటి, దాని ప్రత్యేకతేంటి అనే ధ్యాసలేకుండా కేవలం రాజకీయాలే ప్రాధాన్యంగా మారిపోతున్నాయి. ఇది గతంలో ఎన్నడూ కనిపించని విషయం..
కేంద్రం నుండి రాష్ట్రాల వరకు ఇదే తీరు.ప్రధాని నుండి సీఎంల వరకు ఇదే ధోరణి…
ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అని కాదు..అందరి పరిస్థితి ఇదే..
రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. విమర్శలు ఎన్నో అవకాశాలుంటాయి. ఆగస్టు 15నాడు దేశం గురించి, ప్రజల బాగోగుల గురించి మాట్లాడాల్సిన నేతలు అక్కడ కూడా విమర్శలు, తప్పొప్పులు, కౌంటర్లకే ప్రాధాన్యం ఇవ్వటం మారుతున్న రాజకీయ సంస్కృతిని స్పష్టంగా చెప్తోంది.
నిజంగా గత ప్రభుత్వాలు ఇలా లేవు..
గత నాయకులు ఇలాలేరు…
నెహ్రూ హయాంలోనో, వాజ్ పేయి కాలంలోనో కచ్చితంగా ఇలా జరగలేదు.
రాజకీయంగా నేతల మధ్య ఎన్ని విభేదాలున్నా, వ్యక్తులుగా శ్రతువులుగా వ్యవహరించలేదు. కానీ, ఇప్పుడలాంటి సంస్కతి స్పష్టంగా కనిపిస్తోంది. ఏడున్నర దశాబ్దాల భారత రాజకీయాలు ఈ పరిస్థితికి వచ్చాయని ఆవేదన చెందాల్సిన పరిస్థితి వచ్చింది.
రాజకీయాల్లో కొంత కాలంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పదవి చుట్టూ రాజకీయాలు నడవటం కొత్త కాకపోయినా.. దానికోసం ఎంత వరకు వెళ్తారనే అంశంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏం చేసైనా అధికారం నిలబెట్టుకోవాలి.. ఎలాంటి ఎత్తుగడ వేసైనా ప్రత్యర్థిని చిత్తు చేయాలి. ఇదే లక్ష్యంతో అన్ని పార్టీల వ్యూహాలు కనిపిస్తున్నాయి. అందుకే కొంత కాలంగా ఏ సభ జరిగినా విమర్శలు ఘాటుగానే కనిపిస్తున్నాయి.
కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది. అదే సమయంలో దేశమంతా విస్తరించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికో వ్యూహం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి అధికారం కైవసం చేసుకుందనే ముద్ర బిజెపిపై పడింది. అయితే, ఇదంతా రాజకీయాల్లో సహజమే అని, తాము చేస్తున్నది తప్పేం కాదని బిజెపి నమ్ముతోంది. పైగా ఇదే తరహా రాజకీయాలు గతంలో చేసిన చరిత్ర ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కి కూడా ఎంతో కొంత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కంటే రెండాకులు ఎక్కువ చదివిన బిజెపి ఇలాంటి లెక్కల్లో ఆరితేరింది.
ఫైనల్ గా గెలిచామా లేదా అనేది ముఖ్యం తప్ప, ఏం చేశాం, ఎలా చేశాం అనేది అనవసరం అనే ధోరణిలో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో, అనుకూలంగా లేని ప్రాంతీయ పార్టీలపై బిజెపి యుద్ధమే చేస్తోంది. బెంగాల్ లో తృణమూల్, తెలంగాణలో టియ్యారెస్, ఢిల్లీలో ఆప్ మొదలైన పార్టీలో బిజెపితో ఇదే తరహా ఘర్షణ వాతావరణంలో ఉన్నాయి. కొంత కాలంగా సాగుతున్న ఈ వాతావరణం ఏ స్థాయికి చేరిందంటే ఇండిపెండెన్స్ డే అని కూడా నేతలు చూడని పరిస్థితికి వచ్చింది.
నిక్కచ్చిగా చెప్పాలంటే, గత ప్రభుత్వాలు ఇలా లేవు. నెహ్రూ, వాజ్ పేయి, రాజీవ్ గాంధీ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.. స్వతంత్ర దినోత్సవం నాడు ఎప్పుడూ కలహించుకున్న చరిత్ర లేదు.. ఈ రోజుకో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుకో పవిత్రత ఉంది. ఆ విలువను గుర్తించి గత ప్రభుత్వాలు, గత నాయకులు వ్యవహరించారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా, వ్యక్తులుగా బద్ధశత్రువులం కాదనే స్పృహతోనే ఉన్నారు. అందుకే ఆగస్టు 15 అయినా, జనవరి 26 అయినా, ఎట్ హోం లాంటి సందర్భాలైనా, సామరస్యంగానే వ్యవహరించారు. ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఈ రోజుని కూడా అన్ని సందర్భాల్లాగే రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. విమర్శలు గుప్పించటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ వ్యవస్థ సరైన దిశలో లేదని చెప్తోంది.