Zimbabwe: ప్రస్తుతం టీమిండియా వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతోంది. ఈనెల 18 నుంచి జింబాబ్వే గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే జింబాబ్వే ఇటీవల జోరు మీద కనిపిస్తోంది. బంగ్లాదేశ్ జట్టుపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుని తాము బలహీనం కాదని టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆల్‌రౌండర్ ఇన్నోసెంట్ కియా టీమిండియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తాము భారత జట్టుకు పోటీ ఇవ్వడం కాదని… చుక్కలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో తన మాటే శాసనమని.. టీమిండియాకు తమ చేతిలో ఓటమి రుచి చూపిస్తామని తెలిపాడు. ఈ సిరీస్‌లో తాను టాప్ స్కోరర్‌గా నిలుస్తానని ఆశిస్తున్నట్లు ఇన్నోసెంట్ కియా పేర్కొన్నాడు.
Read Also: ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!
అటు టీమిండియాపై మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుస్తామని జింబాబ్వే ఆల్‌రౌండర్ ఇన్నోసెంట్ కియా వ్యాఖ్యానించాడు. ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం తమకు ప్లస్ పాయింట్ అవుతుందన్నాడు. మరోవైపు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు విశ్రాంతి ఉన్న సంగతిని గుర్తుచేశాడు. వాళ్లు లేకున్నా తమ దేశానికి వచ్చిన జట్టు పటిష్టంగా కనిపిస్తుందని.. వాళ్లను తక్కువగా అంచనా వేసే ఉద్దేశం తమకు లేదన్నాడు. అయితే.. తాము మాత్రం పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇన్నోసెంట్ కియా విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా జింబాబ్వేలోని హరారే వేదికగా ఈనెల 18 నుంచి మూడు వన్డేలు జరగనున్నాయి. ఈనెల 18న తొలి వన్డే, 20న రెండో వన్డే, 22న మూడో వన్డే జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభం కానున్నాయి.