Virat Kohli Breaks Two World Records: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ని గెలిపించిన కోహ్లీ, ఈ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. తన ఖాతాలో రెండు వరల్డ్ రికార్డులను వేసుకున్నాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, కెప్టెన్ రోహిత్ శర్మల రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో చేసిన అర్థశతకంతో కోహ్లీ ఐసీసీ టోర్నీల్లో మొత్తం 24 హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక అర్థశతకాలు చేసిన సచిన్ రికార్డ్‌ని (23) బ్రేక్ చేశాడు. అలాగే.. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమించాడు. టీ20ల్లో ఇప్పటివరకూ 143 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 3741 పరుగులు చేయగా.. 110 ఇన్నింగ్స్‌ల్లోనే 3794 పరుగులు చేసి, టీ20ల్లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా అవతరించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్ (51) అర్థశతకాలతో రాణించడంతో.. పాక్ అంత స్కోరు చేయగలిగింది. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో తడబడింది. పాక్ బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ దెబ్బకు.. 32 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. అయితే.. అప్పుడు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ(82), హార్దిక్ పాండ్యా(40) మాత్రం మ్యాచ్‌ని మలుపు తిప్పేశారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కి ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో కోహ్లీ మరింత విజృంభించడంతో.. భారత్ చిరకాలం గుర్తుండిపోయే అపురూప విజయాన్ని నమోదు చేయగలిగింది. తాను ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా.. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.