World Test Championship: బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఎనిమిది విజయాలు, నాలుగు ఓటములతో 99 పాయింట్లతో 58.93 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు, ఒక ఓటమితో 120 పాయింట్లు సాధించింది. అటు దక్షిణాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 72 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
Read Also: Spirit: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ కొత్త సినిమా
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా వెళ్లాలంటే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఒకవేళ సిరీస్ ఓడిపోయినా, డ్రా చేసుకున్నా భారత్ అవకాశాలు దెబ్బతింటాయి. మరోవైపు దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో చిత్తుగా ఓడిన సఫారీలు మిగతా రెండు టెస్టుల్లో గెలిస్తే భారత్‌కు డబ్ల్యూటీసీలో గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాకుండా స్వదేశంలో వెస్టిండీస్‌తో కూడా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. కాబట్టి స్వదేశంలో ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్టు సిరీస్‌ను భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 4-0తో గెలిస్తే ఫైనల్ ఆడడం ఖాయం.