టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో ప్రచారం జరిగింది. 2017లో అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారం ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. 2016లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే.. రెండేళ్ల కాలం పూర్తవకుండానే ఏడాది తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్‌కు తన పద్ధతులతో ఇబ్బందిగా ఉందని తెలిసిందంటూ కుంబ్లే స్వయంగా వెల్లడించడంతో వివాదం రేగింది.
Read Also: ఐపీఎల్-2022 వేలం బరిలో రాజోలు కుర్రాడు
తాజాగా కుంబ్లే వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా టీమిండియా మాజీ మేనేజర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2017లో టీమిండియాకు మేనేజర్ గా పనిచేసిన రత్నాకర్ శెట్టి కుంబ్లే-కోహ్లీ మధ్య నడిచిన వ్యవహారంపై నోరు విప్పాడు. ‘ఆన్ బోర్డ్’ పేరిట రాసిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కుంబ్లే, కోహ్లీ మధ్య విభేదాలు నిజమేనని.. అయితే కుంబ్లేపై కోహ్లీదే పైచేయి అని రత్నాకర్ శెట్టి పేర్కొన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ తర్వాత కుంబ్లేని తీసేయాలంటూ చాలా మంది కోరుకున్నారని వివరించాడు. జట్టులోని ఆటగాళ్లకు కుంబ్లే ఏనాడూ తోడ్పాటు ఇవ్వలేదని కోహ్లీ భావిస్తుంటాడని.. అదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచిందన్నాడు. దీంతో డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ వాతావరణం ఉండేదన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు లండన్‌లో ఓ సమావేశం జరిగిందని… దానికి విరాట్, అనిల్ కుంబ్లేతో పాటు జోహ్లీ, అమితాబ్ చౌదరి, డాక్టర్ శ్రీధర్ వంటి బీసీసీఐ అధికారులు హాజరయ్యారని, ఆ సమావేశంలో బహిరంగంగానే కుంబ్లేపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడని రత్నాకర్ శెట్టి తాను రాసిన పుస్తకంలో గుర్తు చేశాడు.