Saba Karim Says Why BCCI Not consider Ravindra Jadeja as Team India Test Captain: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇటీవల భారత టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2023లో రాణించిన అజింక్య రహానేకు టెస్టు జట్టులో స్థానం దక్కింది. అంతేకాదు తిరిగి వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేయడంపై భారత జట్టు మాజీ వికెట్ కీపర్ మరియు మాజీ సెలెక్టర్ సబా కరీమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేదా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుందన్నాడు. జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సబా కరీం అన్నాడు.
స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సబా కరీం మాట్లాడుతూ… ‘అందరూ రవీంద్ర జడేజా గురించి ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావడం లేదు. భారత జట్టు టెస్ట్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. టెస్టుల్లో రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. మూడు ఫార్మాట్లలోనూ జడేజా ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత తదుపరి కెప్టెన్ ఎవరన్న చర్చ వచ్చినపుడు జడేజా పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు?’ అని ప్రశ్నించాడు.
Also Read: Sehwag-Sachin: మేం ముసలోళ్లం అయ్యాం.. సచిన్‌ను మోయడం మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్
‘మూడు ఫార్మాట్లలోనూ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు లేడు. భారత జట్టును ముందుకు నడిపించ గల సత్తా అతడిలో ఉంది. ఒకవేళ జడేజా పేరును పరిశీలనలోకి తీసుకోకపోతే.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఉన్నాడు. భారత సెలెక్టర్లు భవిష్యత్ ఆశాకిరణమైన గిల్ పేరునైనా పరిగణనలోకి తీసుకోవాలి. వీరిద్దరూ కాకుండా ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. యువ ప్లేయర్స్ యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు చోటిచ్చారు.. ఇది చాలా బాగుంది. అయితే అజింక్య రహానేను వైస్ కెప్టెన్ చేయడం వెనుక లాజిక్ ఏంటో అర్థం కాలేదు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయి తిరిగి వచ్చిన అతడు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతడు రాణించినా.. భవిష్యత్ టీమిండియా నిర్మిస్తున్నపుడు మళ్లీ రహానేనే వైస్ కెప్టెన్‌గా ఎందుకు చేశారు. సత్తా ఉన్న యువ ఆటగాడికి ఇవ్వొచ్చు కదా?’ అని సబా కరీం పేర్కొన్నాడు.
వెస్టిండీస్ టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
Also Read: Sarvajit Laxman Century: హైదరాబాద్ నుంచి.. మరో క్రికెటర్ తనయుడు వచ్చేస్తున్నాడు!