VVS Laxman Son Sarvajit Laxman Smashesh First Century: భారత క్రికెట్‌లో ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్ల తనయులు ఆటలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్, రోజర్ బిన్నీ తనయుడు స్టువర్ట్ బిన్నీ, వినూ మన్కడ్ పుత్రుడు అశోక్ మన్కడ్, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్.. ఇలా చాలా మంది క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి భారత దిగ్గజ ఆటగాడు, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తనయుడు సర్వజిత్ లక్ష్మణ్ చేరాడు. సర్వజిత్ క్రికెట్ ప్రయాణం ఇప్పటికే మొదలైంది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌ల్లో సర్వజిత్ లక్ష్మణ్ తన తొలి సీజన్ ఆడుతున్నాడు. ఆడటమే కాదు తొలి సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. రెండు రోజుల లీగ్‌లో భాగంగా సికింద్రాబాద్ నవాబ్స్ తరపున అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సర్వజిత్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లో 30 పరుగులు చేసిన సర్వజిత్.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. బుధవారం ఫ్యూచర్ స్టార్ జట్టుతో ముగిసిన మ్యాచ్‌లో సర్వజిత్ లక్ష్మణ్ 104 రన్స్ చేశాడు. 209 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో శతకం సాధించాడు. మైదానం నలు మూలాల షాట్లు ఆడుతూ అలరించాడు.
Also Read: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్!
తండ్రి వీవీఎస్ లక్ష్మణ్ అడుగుజాడల్లో నడుస్తున్న సర్వజిత్ లక్ష్మణ్ కుడి చేతి వాటం బ్యాటర్ మాత్రం కాదు. సర్వజిత్ ఎడమ చేతి వాటం బ్యాటర్. ఎడమ చేతి వాటం బ్యాటర్‌లకు ఏ జట్టులో అయినా ప్రత్యేక స్థానం ఉంటుందన్న విషయం తెలిసిందే. బాగా ఆడుతూ అండర్ 19 జట్టుకు సెలక్ట్ అయితే సర్వజిత్ పేరు మార్మోగిపోతోంది. అండర్ 19 జట్టులో బాగా ఆడితే జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. అయితే అదేమీ అంత సులువు కాదు. భారత దిగ్గజ క్రికెటర్లు జాతీయ జట్టులో రాణించిన దాఖలు పెద్దగా లేవు. అర్జున్ టెండూల్కర్ ఇప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. మరి సర్వజిత్ లక్ష్మణ్ అయినా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని రాణిస్తాడేమో చూడాలి.
ఇక ఫ్యూచర్ స్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ నవాబ్స్ 191 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఫ్యూచర్ స్టార్ 70.5 ఓవర్లలో 427 పరుగులకు ఆలౌటైంది. ఆపై సికింద్రాబాద్ నవాబ్స్ 71.3 ఓవర్లలో 236కే పరిమితం అయింది. సర్వజిత్ లక్ష్మణ్ పోరాడినా.. అతడికి అండగా నిలిచే బ్యాటర్ కరువయ్యాడు. అఖిల్ (42) మాత్రమే రాణించాడు. సాయి కార్తీకేయ (5/46), దివేశ్ బజాజ్ (4/57) సికింద్రాబాద్ నవాబ్స్ పనిపట్టారు.