Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా యువ పేసర్ కూడా చేరాడు. టీమిండియా పేసర్, రాజస్థాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. తన అనారోగ్య పరిస్థితి గురించి ఖలీల్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
క్రికెట్‌కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయం అని ఖలీల్ అహ్మద్ తన పోస్టులో వెల్లడించాడు. అయితే ఇది తప్పడం లేదని.. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, అందుకే రంజీ ట్రోఫీ సీజన్‌లో చాలా మ్యాచులకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. అయితే తాను త్వరలోనే కోలుకుని జట్టులోకి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. అయితే ఖలీల్ అహ్మద్ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Pakistan: మేం పాకిస్తాన్‌లో ఉండలేం.. దేశం వీడేందుకు సిద్ధం
2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్ టీమిండియా తరపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 15 వికెట్లు, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అయితే ధారాళంగా పరుగులు ఇస్తుండటంతో అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఖలీల్ అహ్మద్ కోసం ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టు హోరాహోరీగా పోటీపడ్డాయి. దీంతో అతడిని రూ.5.25 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.