అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్‌లో భాగంగా ఓ మహిళ కలెక్టర్ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది… చెస్ బోర్డుపై పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో తెరకెక్కించారు. చెస్ బోర్డులో రాజు, మంత్రిగా, సైనికులుగా, గుర్రాలుగా, ఒంటెలుగా, ఏనుగులుగా మనుషులే వేషం ధరించి కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా వీడియోను రూపొందించారు. చదరంగం గురించి అందరికీ తెలిసిందే. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. అవతలి జట్టును చిత్తు చేస్తుంటారు. నలుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ పావులు మన ఎత్తులకు తగినట్లుగా సజీవంగా కళ్ల ముందుకి వచ్చి యుద్ధం చేస్తే ఇలా ఉంటుంది అన్న విధంగా ఓ వీడియోను తెరకెక్కించారు. తమిళనాడులోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. చెస్ బోర్డులో రాజు, మంత్రిగా, సైనికులుగా, గుర్రాలుగా, ఒంటెలుగా, ఏనుగులుగా మనుషులే వేషం ధరించి కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా వీడియోను రూపొందించారు. చదరంగ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ వీడియోను రూపొందించినట్లు కవితా రాము వెల్లడించారు..
Read Also: Nagula panchami: నేడు నాగుల చవితి.. విశిష్టత.. ఎందుకు జరుపుకుంటారు?
చెస్ ఒలంపియాడ్ నేపథ్యంలో రూపొందించిన ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. షేర్లు, కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంది.. ఇక, ఆ వీడియోను చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రశంసలు కురిపించారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో వినూత్న చర్యలు చేపట్టిందని మెచ్చుకున్నారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అనకుండా ఉండలేరు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘ఇదో అద్భుతం. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు’ అని రాసుకొచ్చారు. కాగా, తమిళనాడు వేదికగా దేశంలోనే తొలిసారిగా 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలు జరుగుతోన్న విషయం తెలిసిందే.. ఈ నెల 10వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి.. భారత్ సహా అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్ వంటి 162 దేశాల నుండి 1,735 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.