టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్‌లలో తాను ఆడనని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కి చెప్పాడు. డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టడానికి తాను రంజీ ట్రోఫీలో ఆడానని ఎంసీఏకి తెలియజేశాడు. ఎంసీఏ కూడా సూర్యకుమార్ నిర్ణయంపై సానుకూలంగా స్పందించి.. అతడిని రంజీ ట్రోఫీ నుంచి రిలీజ్ చేసిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్‌ల నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా తప్పుకొన్నాడు. దూబేను కూడా రంజీ ట్రోఫీ నుంచి ఎంసీఏ రిలీజ్ చేసింది. నవంబర్ 16 నుంచి శరద్ పవార్ అకాడమీ వేదికగా పాండిచ్చేరితో జరగనున్న మ్యాచ్‌లో ముంబై తరపున సూర్యకుమార్ యాదవ్, దూబే ఆడాల్సి ఉంది. ఈ ఇద్దరి స్థానాల్లో తనుష్ కొటియన్, మోహిత్ అవస్థిలను ఎంసీఏ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య ఆడనున్నాడు. ఇటీవల పెద్దగా ఫామ్‌లో లేని సూర్య.. ప్రోటీస్‌తో ఐదు మ్యాచ్‌లలో రాణించాలని చూస్తున్నాడు.