IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్‌నే మూడో వన్డేలోనూ ఎంచుకున్నాడు. అటు దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులు చేసింది. రబాడ, పార్నెల్, కేశవ్ మహారాజ్ స్థానంలో లుంగి ఎంగిడి, ఫెలుక్వాయో, మాక్రో జాన్సన్‌లను తుది జట్టులోకి తీసుకుంది.
Read Also: Tollywood: సీనియర్ డైరెక్టర్ ఆదిత్య కన్నుమూత!
అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జానేమన్ మలాన్ (15), డికాక్ (6), రెజా హెండ్రిక్స్ (3) వరుసగా అవుటయ్యారు. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. వీళ్లిద్దరితో పాటు అవేష్ ఖాన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. కాగా ఈ వన్డేలో గెలవడం టీమిండియా కంటే దక్షిణాఫ్రికాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ జట్టు 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ సిరీస్ గెలవాల్సి ఉంటుంది. ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో మే నాటికి తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మిగతా జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది.