ఆర్సీబీ కల ఈసారి కూడా నెరవేరలేదు. మరో ఐపీఎల్ అలా వచ్చి ఇలా వెళ్లింది. అయినా ‘ఈ సాలా కప్ నమదే’ అన్న నినాదం ఆర్సీబీ అభిమానుల మది నుంచి వెళ్లిపోవడం లేదు. దీంతో మరో ఏడాది కోసం వాళ్లంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ఆర్సీబీ ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీ జట్టును దారుణంగా దెబ్బతీసింది. ప్లే ఆఫ్స్‌లో కోహ్లీ కనుక దూకుడుగా ఆడి ఉంటే ఆర్సీబీ కథ మరోలా ఉండేది.
అయితే ఆర్సీబీ ఈ ఏడాది రిటైన్ చేసుకున్న ఆటగాళ్లే ఆ జట్టు కొంప ముంచారు. విరాట్ కోహ్లీ, సిరాజ్, మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. వీరందరూ కలిసికట్టుగా పోటీలు పడి మరీ విఫలమయ్యారు. ముఖ్యంగా సిరాజ్ అయితే బౌలింగ్‌లో తేలిపోయాడు. రూ.7 కోట్లకు రిటైన్ చేసుకున్న మహ్మద్ సిరాజ్ 15 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మ్యాక్స్‌వెల్ కూడా గొప్పగా రాణించిన సందర్భాలు లేవు. ఐపీఎల్ 2021 సీజన్లో 14 మ్యాచుల్లో 513 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను చూసి ఆర్సీబీ ఈ ఏడాది అతడిని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. తీరా ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 301 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 16 మ్యాచ్‌లు ఆడి 341 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్ కాగా రెండు సార్లు మాత్రమే 50కి పైగా పరుగులు చేయగలిగాడు.
అయితే గమనించదగ్గ విషయం ఏంటంటే.. ఆర్సీబీ వేలంలో వదులుకున్న చాహల్ రాజస్థాన్ తరఫున దుమ్మురేపేలా ఆడాడు. అతడు 17 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. ఒకవేళ సిరాజ్ స్థానంలో చాహల్‌ను రిటైన్ చేసుకుని ఉంటే ఆర్సీబీ టైటిల్ విన్నర్ అయ్యేదని ఆ జట్టు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.