టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ 45 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును రోహిత్ క్రాస్ చేశాడు.
అలాగే టీ20ల్లో ఓపెనర్‌గానూ అత్యధిక సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుటైన ఆటగాడిగానూ రోహిత్‌దే వరస్ట్ రికార్డు. ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ 29 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (28)ను రోహిత్ శర్మ అధిగమించాడు. కాగా ఆదివారం జరిగిన మూడో టీ20 ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో 125 మ్యాచ్‌లను ఆడిన రోహిత్.. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్‌లు) రికార్డును క్రాస్ చేశాడు.