Pakistan Won Against Bangladesh And Enters In Semi Finals: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి, బంగ్లా జట్టుని చిత్తుగా ఓడించి, సెమీస్‌లో బెర్త్‌ని ఖరారు చేసింది. తొలుత బంగ్లా జట్టుని 127 పరుగులకే కట్టడి చేసిన పాకిస్తాన్.. బ్యాటింగ్‌లో బాగా రాణించడంతో, లక్ష్యాన్ని సునాయాసంగా చేధించగలిగింది. స్వల్ప లక్ష్యమే కావడంతో.. ఎక్కడా ఆవేశపడకుండా, పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ, తమ జట్టుని గెలిపించుకున్నారు. నిజానికి.. సెమీర్ బెర్త్ కోసం ఇరు జట్లకి ఈ మ్యాచ్ ప్రాధాన్యం కావడంతో, హోరాహోరీగా పోరు సాగుతుందని అనుకున్నారు. కానీ, పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ వార్‌ని వన్ సైడ్ చేసేసి, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. బంగ్లా జట్టులో విధ్వంసకర ఆటగాడైన లిటన్ దాస్ (10) త్వరగా ఔట్ అవ్వడంతో.. ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. దీంతో.. ఓపెనర్ శాంతో, సౌమ్య సర్కార్ ఆచితూచి ఆడారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా, నెమ్మదిగా రాణించారు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇది చూసి.. ఇక బంగ్లా జట్టు కుదురుకుందని, ఇకపై పరువుల వర్షం కురిపించడం ఖాయమని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఆ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, ఎవ్వరూ పెద్దగా ఖాతా తెరువలేకపోయారు. ఓపెనర్ శాంతో (54) ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి, జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. మధ్యలో సౌమ్య సర్కార్ (20), ఆఫిఫ్ హుసేన్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. ఇక మిగతావాళ్లంతా చేతులు ఎత్తేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రీది 4 వికెట్లు, షాదాబ్ ఖాన్ 2, హారిస్ రౌఫ్, ఇఫ్తిఖర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. స్వల్ప లక్ష్యమే కావడంతో నిదానంగా ఇన్నింగ్స్‌ని నెట్టుకొచ్చింది. ఓపెనర్లుగా వచ్చిన రిజ్వాన్(32), బాబర్(25) తొలి వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత వెనువెంటనే రెండు వికెట్లు పడ్డా.. పాక్ జట్టు ఒత్తిడికి గురవ్వకుండా, సునాయాసంగా లక్ష్యం దిశగా సాగింది. హారిస్ (31) కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోయాడు. షాన్ మసూద్ టెంప్ట్ అవ్వకుండా, చివరివరకు క్రీజులో నిలబడి జట్టుని గెలిపించాడు. చేతిలో 5 వికెట్లు, 11 బంతులు మిగిలి ఉండగానే.. పాక్ లక్ష్యాన్ని చేధించి, విజయం సాధించింది. దీంతో ఈ జట్టు సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. సౌతాఫ్రికా ఓడిపోవడం వల్ల.. పాక్‌కి లైఫ్ వచ్చిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఆ జట్టు నెదర్లాండ్స్‌పై గెలిచి ఉంటే, పాక్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతు అయ్యేవి.