వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెర్బియాకు చెందిన అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్‌పై 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడినప్పటికీ వరుసగా మూడు సెట్లు చేజిక్కించుకుని జొకోవిచ్ టైటిల్ సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నాలుగో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కెరీర్‌లో మొదటి గ్రాండ్ స్లామ్ గెలుచుకోవాలనుకున్న ఆసీస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. కీలక సమయాల్లో తప్పిదాలు కిర్గియోస్‌కు ప్రతికూలంగా మారాయి.
Read Also: IND Vs ENG: సూర్యకుమార్ సెంచరీ వృథా.. మూడో టీ20లో ఇంగ్లండ్ గెలుపు
కాగా తన అనుభవంతో ఒత్తిడిని అధిగమించి మ్యాచ్‌ను, మరోసారి వింబుల్డన్ టైటిల్‌ను జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్‌లో జొకోవిచ్‌కు ఇది వరుసగా నాలుగో టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా ఇది అతడి కెరీర్‌లో 7వ వింబుల్డన్ టైటిల్. తాజా విజయంతో జొకోవిచ్ కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 21కి చేరింది. ఈ మేరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రఫెల్ నాదల్ రికార్డుకు మరో గ్రాండ్ స్లామ్ దూరంలో నిలిచాడు.